సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ మహానగర ప్రజలకు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులకు రాజాసింగ్ కీలక రిక్వెస్ట్ చేస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. అందులో రాజాసింగ్ మాట్లాడుతూ సంక్రాంతి వేళ నగరంలో యువకులు, పిల్లలు పెద్ద మొత్తంలో పతంగులు ఎగురవేస్తున్నారు. ఎంతో ఉల్లాసంగా జరిగే ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని.. తమ పిల్లలు పతంగులు ఎగురవేసే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో పాటే ఉండాలని ఎమ్మెల్యే రాజాసింగ్ రిక్వెస్ట్ చేశారు.
చైనా మాంజాలతో జాగ్రత్తగా ఉండాలని తమ పిల్లలకు వాటిని కొనకుండా చూడాలన్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి తమ పిల్లలను తెగిన పతంగుల కోసం వెళ్లకుండా చూసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ మహానగరంలో సంక్రాంతి వేడుకలు అంటే పతంగుల పోటీతోనే ప్రారంభం అవుతాయి. భోగీ ముందు రోజు నుంచే నగరంలో పతంగుల ఎగురవేతలు ప్రారంభం అవుతాయి.