బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎందరికో ఆదర్శం. అటు ఉద్యమ సమయంలోనూ, ఇటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ.. వ్యవసాయంపై తనకున్న మక్కువను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. బిజీ షెడ్యూల్లోనూ వ్యవసాయంపై దృష్టి సారించే వారు కేసీఆర్. అంతేకాదు.. ఈ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడనే ఉద్దేశంతో హరితహారం వంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టి.. హరిత విజయం సాధించారు.
ఇప్పుడు కేసీఆర్ అడుగుజాడల్లో ఆయన మనువడు కల్వకుంట్ల హిమాన్షు రావు నడుస్తున్నాడు. తీరిక సమయంలో తన తాతయ్యతో వ్యవసాయ క్షేత్రంలో హిమాన్షురావు గడుపుతూ.. రైతన్నలా కష్టపడుతున్నాడు. పార చేతబట్టి.. అన్నదాతల మారిపోయాడు. చెమటోడ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయాడు. మనువడు పడుతున్న కష్టాన్ని చూసి కేసీఆర్ కూడా మురిసిపోయారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో హిమాన్షు రావు తన తాత సూచనలతో తానే స్వయంగా పారతో మట్టి తీసి, ఓ చెట్టును నాటాడు. ఆ చెట్టు చుట్టూ ఎరువును కూడా పోసి మళ్లీ పారతో మట్టిని కప్పాడు. ఆ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన హిమాన్షు.. ఓ సందేశం ఇచ్చాడు. ఉత్తముల నుంచి నేర్చుకోవడం అని రాసుకొచ్చాడు.