శుభ్రంగా ఉండటం వేరు..అందంగా ోఉండటం వేరు. చాలామంది అందంగా ఉండాలని..శరీరానికి అవసరంలేనివి రాసేసి వంటి శుభ్రతను పాడుచేసుకుంటారు. లేపినపోని స్కిన్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు. అయితే అందంగా ఉండాలని చేసే అన్ని పద్దతులు తప్పు అనటం లేదు. కొన్ని మంచివి కూడా ఉన్నాయి. కానీ అందంగా ఉండటంలో ముఖం మాత్రమే బాగుండాలనుకుంటారు. ఫేస్ మీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అసలు ముఖం మీద పెట్టే టైమ్..శ్రద్ధ ఇతర పార్ట్క్ మీద కూడా పెట్టేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ముఖంతో పాటు చేతులు, కాళ్లు కూడా శుభ్రంగా..ఆరోగ్యంగా ఉంటేనే..కదా అవి కూడా అందంగా మారతాయి.
పాదాల సంరక్షణకు పెడిక్యూర్, గోళ్ల సంరక్షణకు మెనీక్యూర్ విధానాలు అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్ని బ్యూటీపార్లర్లలో వివిధ ట్రీట్మెంట్లతోపాటు మెనీకూర్, పెడిక్యూర్‌లను అందిస్తున్నారు.కానీ ఫేస్ ప్యాక్ చేయించుకునే వాళ్లు అందరూ ఇవి కూడా చేయించుకోరు. అలా అని ఇంటిదగ్గర పాదాలకోసం ఏమైనా చేస్తారా అంటే..అదీ తక్కువే. పాదాలను గోళ్లను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే పెడిక్యూర్ ముఖ్య ఉద్దేశం.. పెడిక్యూర్ అనేది లాటిన్ పదం. లాటిన్ లో పెస్ లేదా పెడ్ అంటే పాదము, క్యూర్ అంటే రక్షణ అని అర్థం. చేతులు, చేతివేళ్లు, గోళ్లను అందంగా తీర్చిదిద్దే పద్ధతే మెనీక్యూర్. మెనీక్యూర్ కూడా లాటిన్ పదమే. మానస్ అంటే చేయి, క్యూర్ అంటే జాగ్రత్త అని అర్థం. అలా ఈ పదాలు వాడుకలోకి వచ్చేశాయి. ఈ రోజు మనం ఈ రెండింటికి గురించి తెలుసుకుందాం. వీటివల్ల లాభాలు తెలిస్తే…ఇంట్లో అయినా వీటిని చేసుకోవచ్చు కదా..!
పెడిక్యూర్
మర్దన ద్వారా పాదాలను కాపాడుకోవడమే పెడిక్యూర్. రోజంతా పనిచేసి అలసిపోయిన మోకాళ్లు, పాదాలు, మడమలు, కాలి వేళ్లు, గిలకలకు సున్నితమైన మసాజ్ సాయంతో ఉపశమనం కలిగించడం పెడిక్యూర్‌లో ఒక భాగం. ఈ విధానంలో ప్యూమిస్ స్టోన్, మసాజ్ క్రీమ్, నెయిల్ బ్రష్, నెయిల్ కట్టర్, టబ్‌లను ఉపయోగిస్తారు.
పెడిక్యూర్ చేసే పద్ధతి..
ముందుగా కాలి గోళ్ల పెయింట్‌ను తొలగిస్తారు. తరువాత గోళ్లను మనకు నచ్చిన షేప్ లో కట్ చేస్తారు. తరువాత ఒక టబ్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని దానిలో చిటికెడు ఉప్పు, సుగంధ నూనె, నిమ్మరసం, షాంపు వేసి 30 నిమిషాల పాటు పాదాలను నానబెడతారు. పాదాలు నానిన తరువాత ప్యూమిస్ స్టోన్ లేదా గరుకుగా ఉండే పిండితో మడమలు అరికాళ్లు శుభ్రంగా రుద్దుతారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత మర్దనా ఆయిల్ లేదా మాయిశ్చరైజర్‌తో పాదాలను మొదట సుతిమెత్తంగా, తరువాత కాస్త గట్టిగా మసాజ్ చేస్తారు. ఆపై శుభ్రంగా తుడుస్తారు. మసాజ్‌తో పాదాలకు ఉపశమనం కలిగి మానసికంగా ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా నెలకు రెండు సార్లు పెడిక్యూర్ చేసుకుంటూ ఉంటే పాదాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. మనకు మనం చేసుకున్నదానికంటే..వేరేవాళ్లు చేస్తుంటే భలే హాయిగా ఉంటుంది. పెడిక్యూర్ కు కావాల్సి పరికరాలు అన్ని మన దగ్గర ఉంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు.
పెడిక్యూర్ రకాలు
పెడిక్యూర్ చేసే విధానంలో ఉపయోగించే సామాగ్రి, క్రీములు, అవి ఇచ్చే ఫలితాలను బట్టి వివిధ రకాల పెడిక్యూర్లు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని రకాలు చూద్దాం.
ప్రెంచ్ పెడిక్యూర్, జెల్ పెడిక్యూర్, పారఫిన్ పెడిక్యూర్, హాట్‌స్టోన్ పెడిక్యూర్, ఫిష్ పెడిక్యూర్, మిని పెడిక్యూర్, స్పా పెడిక్యూర్, ఐస్‌క్రీం పెడిక్యూర్, పెడిక్యూర్, వాటర్ లెస్ పెడిక్యూర్, క్లాసిక్ లేదా రెగ్యులర్ పెడిక్యూర్, సాల్ట్ పెడిక్యూర్, చాక్లెట్ పెడిక్యూర్, అథ్లెటిక్ లేదా స్పోర్ట్స్ పెడిక్యూర్, రోజ్ పెడిక్యూర్, మిల్క్ అండ్ హనీ పెడిక్యూర్, వైన్ పెడిక్యూర్, షాంఘై పెడిక్యూర్, బేసిక్ క్యూర్‌ను మనం ఇంట్లో ట్రై చేయవచ్చు..కానీ మిగిలినవి నిపుణులతోనే చేయించుకోవాలి.
మెనీక్యూర్ ఎలాగంటే
ముందుగా చేతి గోళ్లకు ఉన్న నెయిల్ పెయింట్‌ను తుడిచివేయాలి. తర్వాతా గోళ్లను నచ్చిన ఆకృతిలో అందంగా కత్తిరించి ట్రిమ్ చేస్తారు. ఇలా రెండు చేతుల గోళ్లను ట్రిమ్ చేశాక, ఒక గిన్నెలో సోప్ వాటర్‌ను తీసుకుని దానిలో హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిజరిన్, నిమ్మరసం వేసి రెండు చేతుల వేళ్లు మునిగేలా అందులో ముంచి 10 నిమిషాలపాటు ఉంచుతారు. ఇలా చేయడం వల్ల గోళ్లలో ఉండే మలినాలు, సూక్ష్మజీవులు నశించి గరుకుగా ఉంటే క్యూటికల్స్ మెత్తగా అవుతాయి. గోరు చుట్టూ ఉండే చర్మం కూడా మెత్తబడుతుంది. తరువాత అరిచేతుల నుంచి మోచేతుల వరకు శుభ్రం చేస్తారు.
ఆపై రెండు చేతులను తడిలేకుండా నీట్ గా టవల్‌తో తుడుస్తారు. క్యూటికల్ రిమూవర్‌తో గోరు చుట్టూ ఇంకా ఏమైనా క్యూటికల్ బిట్స్ ఉంటే వాటిని తీస్తారు. దీనివల్ల గోరు పెద్దదిగాను అందంగాను కనిపిస్తుంది. తరువాత చేతులను శుభ్రంగా తుడిచి మాయిశ్చరైజర్‌తో చేతులకు వేళ్లకు మర్థన చేస్తారు. ఇలా 15 రోజులకొకసారి చేయడం వల్ల చేతులు అందంగా ఆరోగ్యంగా కనిపిస్తాయి. కాస్త ధరను భరించగలిగినవారైతే నిపుణులతో పెడిక్యూర్, మెనీక్యూర్ చేయించుకుంటే మరిన్ని మంచి ఫలితాలను పొందవచ్చు.
వీటివల్ల డబ్బులు దండగేనా..లాభాలు ఉన్నాయా?
- రోజూవారి స్నానంలో పాదాలను చాలా మంది అశ్రద్ధ చేస్తుంటారు. ఫలితంగా వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. పెడిక్యూర్ చేయించుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
- తరచుగా ఎదురయ్యే పాదాల పగుళ్లను పెడిక్యూర్ చేయటం ద్వారా చక్కగా తగ్గించుకోవచ్చు.
గోళ్లకు రక్తప్రసరణ బాగా జరగడం వల్ల అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. గోళ్లకు కూడా పుష్కలంగా పోషకాలు అందడంవల్ల పెరుగుదల మంచిగా ఉండి మరింత కాంతివంతంగా కనిపిస్తాయి. ఆడవాళ్లకు గోళ్లు అంటే ఎంత ఇష్టమే వేరే చెప్పనక్కర్లేదు. - పెడిక్యూర్ విధానంలో పాదాలకు మంచి మర్దన లభిస్తుంది. దీనివల్ల పాదాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో ఎటువంటి నొప్పులు, ఆర్థరైటీస్, వెరికోస్ వెయిన్స్ వంటివి రావు.
- పాదాలకు చేసే మసాజ్‌తో శరీరం మొత్తం ఒకేరకమైన ఉష్ణోగ్రతలు కొనసాగడంతోపాటు, లింఫ్నోడ్స్లోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.
- సుతిమెత్తని పాదాలకు మసాజ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మసాజ్‌తో ఒత్తిడి తగ్గి మనస్సు ఉత్సాహంగా ఉంటుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉండబట్టే బ్యూటీపార్లర్లు, స్పాలు అందించే ఈ క్యూర్లపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్నీ పార్ట్స్ అందంగా ఉంటాయి. అందంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు..కానీ ఆరోగ్యంగా ఉంటే..అందంగా ఉన్నట్లే.