బీజేపీ పాలిత మణిపూర్‌లో గత రెండేళ్లుగా రాజకీయ పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో దేశవ్యాప్తంగా తెలిసిన విషయమే. ముఖ్యంగా మణిపూర్ లో మైతేయి, కుకీ వర్గాల మధ్య మే 2023 నుంచి ఘర్షణలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఇటీవలే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రాజీనామాను గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆమోదించారు. అయితే కొత్త ముఖ్యమంత్రి నియామకం వరకు బీరేన్ సింగ్ తాత్కాలికంగా పదవిలో కొనసాగాలని గవర్నర్ సూచించారు.
రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రానికి సమగ్ర నివేదిక పంపిన గవర్నర్, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖలో అత్యున్నత స్థాయిలో సమీక్ష జరిపిన అనంతరం.. రాష్ట్రపతి పాలన విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అసలే రాష్ట్రంలో కొంతకాలంగా ఘర్షణలు, విద్రోహకార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వర్గపోరాటాలు, సామాజిక అశాంతితో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.