అటు వైసీపీలోనే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతల్లోనూ ఒకే ఒక్కడి చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఆయ నే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన ఇప్పుడు ఏం చేయనున్నారు? ఆయన సత్తా బయటకు వచ్చే సమయం ఇదేనా? తన సత్తాను ఆయన నిరూపించుకుంటారా? అంటూ.. ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. దీనికి కారణం.. తాజాగా జగన్ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేయడమే! మండలిని రద్దు చేస్తూ.. జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే, ఇది నేడు ఢిల్లీకి చేరింది.
కేంద్ర హోంశాఖ వర్గాలు దీనిని అన్ని కోణాల్లోనూ పరిశీలించి, ప్రబుత్వానికి సిఫారసు చేయడం ద్వారా పార్లమెంటులో బిల్లును రెడీ చేస్తారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభలు కూడా ఈ బిల్లుపై చర్చించి, ఆమోదం పొందితే.. అది రాష్ట్రపతి వద్దకు వెళ్లి సంతకానికి నోచుకుని.. అనంతరం మండలి రద్దు ప్రకటనను కేంద్ర ప్రభుత్వం గెజి్ట్‌లో ప్రకటించనుంది. అయితే, ఈ ప్రక్రియ అంతా అంత ఈజీగా జరిగిపోయేది కాదని ప్రభుత్వ వర్గాలతో పాటు రాజకీయ నేతలు కూడా చెబుతున్నారు. అయితే, జగన్ ప్రభుత్వం మాత్రం చాలా ధీమాగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటనేది ప్రస్తుతానికి గోప్యంగా ఉన్నప్పటికీ.. కేంద్రంలో జగన్ ప్రభుత్వానికి అనుకూల వాతావరణం ఉందనేది మాత్రం వాస్తవమని అంటున్నారు ఢిల్లీ పెద్దలు.
ముఖ్యంగా పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఢిల్లీలో బీజేపీ నేతల దగ్గర మంచి యాక్సస్ ఉందని, అదేసమయంలో ప్రధాని కార్యాలయంలోనూ ఆయనకు మంచి పలుకుబడి ఉందని చెబుతున్నారు. గతంలో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రధాని కార్యాలయంలో అనేక పనులు చేయించడంలో సాయిరెడ్డి సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు జగన్ ప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తున్న మండలి తీర్మానం విషయంలోనూ సాయిరెడ్డి దూకుడు చూపిస్తారనే వాదన ఒకటి బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సాయిరెడ్డి త్వరలోనే హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయి ఈ విషయంపై తమ వైఖరిని వెల్లడించనున్నారని తెలుస్తోంది.
ఇదిలావుంటే, అసలు మండలి రద్దు విషయాన్నిముందుగా .. కేంద్రంలోని పెద్దలతో చెప్పాకే జగన్ చేశారనే వాదన కూడా వినిపిస్తోంది. అంటే అన్నీ తమకు తెలుసునని బీజేపీ పెద్దలు కూడా చూచాయగా చెబుతున్నారు. ఇక, బీజేపీ ఎమ్మెల్సీమాధవ్ కూడా ఈ వ్యాఖ్యలకు బలం చేకూరేలా నిన్న మాట్లాడారు. జగన్ ప్రభుత్వం చేసిన తీర్మానం పార్లమెంటులో ఆమోదం పొందడం “లాంఛనమే“ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని బట్టి జగన్ ప్రభుత్వం మండలి రద్దుపై దూకుడుగా వెళ్లడం వెనుక బీజేపీ పెద్దల హస్తం కూడా ఉందని తెలుస్తోంది. ఏదేమైనా.. ఈ తీర్మానం ఆమోదం పొందడంలో విజయసాయి రెడ్డి వ్యూహం ఫలిస్తుందా? లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది.