ఏపీలో వైసీపీ భారీ విజయం తరువాత టీడీపీలో కొంత నైరాశ్యం నెలకొంది. ఇంత ఘోరంగా పార్టీ ఓటమి పాలవుతుందని ఊహించలేకపోయిన టీడీపీ నేతలు… ప్రస్తుతం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొందరు నేతలు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా టీడీపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు కీలకనేత, నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ విక్టర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై ప్రశంసలు.. టీడీపీపై విమర్శలు గుప్పించారు.
పాలన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుపడటం బాధాకరమన్నారు. కర్నూలుకు హైకోర్టు రావడం ఇక్కడ టీడీపీ నేతలకు ఇష్టం లేదని.. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో కార్యకర్తల సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని విక్టర్ చెప్పుకొచ్చారు. కాగా.. రాజీనామా అనంతరం ఆ లేఖను ఫ్యాక్స్ ద్వారా టీడీపీ నేత అధిష్టానానికి పంపినట్లు మీడియాకు వెల్లడించారు.