చైనాలో దాదాపు 2400 మందిని పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్ దెబ్బకు.. దాని చుట్టుపక్కల దేశాలు కూడా భయంతో వణికిపోతున్నాయి. ఆ ప్రాణాంతక వైరస్ ఎక్కడ తమకు అంటుకుంటుందో అన్న భయంతో.. పరిసర దేశాల ప్రజలు నలుగురిలోకి రావడంలేదు. ఒకవేళ తప్పనిసరిగా రావాల్సి వస్తే మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. ఆఖరికి పెండ్లిళ్లకు కూడా మాస్కులు ధరించే వెళ్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇటీవల ఫిలిప్పైన్స్‌లో జరిగింది.
ఫిలిప్పైన్స్‌లోని సముద్రతీర నగరం బాకొలాడ్‌లో అక్కడి ప్రభుత్వం సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించింది. స్థానిక సిటీహాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 220 జంటలు ఒక్కటయ్యాయి. పెండ్లి కొడుకులు తెల్లని అంగీలు, పెండ్లి కూతుళ్లు తెల్లరంగు గౌన్లతో ఈ సామూహిక వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు. దీంతో సిటీహాల్ ప్రాంగణమంతా పాల సముద్రంలా మారిపోయింది. అయితే ఈ కార్యక్రమంలో మాస్కులు ధరించి పాల్గొనడం గమనార్హం.
కరోనా వైరస్ అన్ని దేశాలకు పాకుతుండటంతో ఈ సామూహిక వివాహ మహోత్సవ నిర్వాహకులు.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి నుంచి.. గత 14 రోజులుగా వారు ఎక్కడెక్కడ ప్రయాణాలు చేశారనే వివరాలు సేకరించారు. ఎందుకంటే కరోనా వైరస్ సోకిన 14 రోజుల తర్వాతగానీ వ్యాధి లక్షణాలు బయటపడవు. అందుకే నిర్వాహకులు 14 రోజుల ప్రయాణ వివరాలు తీసుకున్నారు.
అంతేగాక, అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనను కూడా నిర్వాహకులు కచ్చితంగా అమలు చేశారు. దీంతో పెండ్లి పీటలెక్కిన జంటలు మాస్కులతోనే ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, ఆఖరికి ముద్దులు కూడా మాస్కులు ధరించే పెట్టుకోవాల్సి వచ్చింది. మాస్కులతో ముద్దులు పెట్టుకోవడం ఇబ్బందిగానే ఉన్నా.. కరోనా భయంతో తప్పదుగా అని కొత్త జంటలు సరిపెట్టుకున్నారు. పాపం అనిపిస్తుంది కదా!