రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామం చోటు చేసుకుందా? ఎన్నికలకు ముందు చంద్రబాబును తీవ్రస్థాయిలో ఆడిపోసుకున్న కమ్యూనిస్టులు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? ఒక్కసారిగా వారికి చంద్రబాబు దేవుడు అయిపోయాడా? ఇప్పుడు కమ్యూనిస్టులు చేస్తున్న ఆరోపణల వెనుక చంద్రబాబు హస్తం ఉందా? ఇవే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ ప్రశ్నలుగా మారాయి. తాజాగా ప్రభుత్వం చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏంటనే విషయంపైనా మేధావులు దృష్టి పెట్టారు.
రాష్ట్ర విబజన తర్వాత ఏపీలో అడ్రస్ గల్లంతయిన కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎంలు ఆదిలో వైసీపీతో పొత్తులకు సిద్ధమయ్యాయి. అయితే, జగన్ కాదనడంతో వెంటనే జనసేన బాటపట్టాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేశాయి. కొన్ని సీట్లను పంచుకున్నాయి. అయితే ఎక్కడా కూడా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోవడం గమనార్హం. అనంతరం జనసేనకు దూరం జరిగాయి. ఇక, జనసేన పార్టీ బీజేపీతో చేతులు కలపడంతో కమ్యూనిస్టులు న్యూట్రల్ అయ్యారు.
ఇంతలోనే జగన్ ప్రభుత్వంపై దాడి పెంచిన టీడీపీ తమకు మద్దతుగా అప్పటి వరకు గళం వినిపించిన జనసేనాని దూరం కావడంతో తెరచాటున కమ్యూనిస్టులతో ఒప్పందాలు చేసుకుందనేది వాస్తవమే. అయితే, ఈ ఒప్పందంలో భాగంగా టీడీపీ నుంచి కమ్యూనిస్టులకు డబ్బులు అందాయని అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. వాస్తవానికి రాష్ట్రంలో జగన్ పాలన గతంలో కమ్యూనిస్టులు కోరుకున్నట్టే జరుగుతోంది. పేదలకు భూములు పంచడం, పేదల వర్గానికి డబ్బులు ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళ తరహాలో ఇంటికే నిత్యావసరాలను, పింఛన్లు అందించడం వంటివి జరుగుతున్నాయి.
మరి ఇలాంటి కార్యక్రమాలు కావాలనే కదా కమ్యూనిస్టులు కోరుకున్నారు. కానీ, దీనికి విరుద్ధంగా ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతుండడాన్ని చూస్తే.. తెరచాటున చంద్రబాబుతో ఒప్పందంతోపాటు.. డబ్బులు కూడా తీసుకున్నారనే భావనకు బలం చేకూరుతోంది. అటు సీపీఐ, ఇటు సీపీఎం రెండు పార్టీలూ కూడా జగన్‌పై విరుచుకుపడుతుండడాన్ని మేధావులు సైతం ఏవగించుకుంటున్నారు. ఇంతకన్నా ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కమ్యూనిస్టులు తమ స్థాయిని తామే దిగజార్చుకుంటున్నారనే భావన కలుగుతోంది.