ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో పార్టీకి అండగా నిలిచిన ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం “దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలన” సాగిస్తోందని, ప్రజల వ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి పెరిగిపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు. పాఠశాలలు, ఆసుపత్రులు నరకంగా మారాయని, గుడులు, బడుల పక్కనే బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయని ఆరోపించారు.
విశాఖలో వేల కోట్ల విలువైన భూములను టెండర్లు లేకుండా ఉర్సా, లూలు, లిల్లీ వంటి కంపెనీలకు కట్టబెట్టారని జగన్ ఆరోపించారు. “ఊరుపేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల భూములు ఇచ్చారు. ఇది భూముల దోపిడీ కాదా?” అని ఆయన ప్రశ్నించారు. 2018లో 36,000 కోట్ల విలువైన అమరావతి పనులను ఇప్పుడు 78,000 కోట్లకు పెంచారని, టెండర్లలో రింగ్ ఏర్పాటు చేసి తమ మిత్రులకు కట్టబెట్టారని, మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో 8 శాతం కమీషన్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు ప్రభుత్వంలో 4 లక్షల పింఛన్లు రద్దు చేశారని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని జగన్ విమర్శించారు. తమ హయాంలో డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యేవని ఆయన గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన జగన్, “జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాను” అని స్పష్టం చేశారు. “చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. ప్రజలు మోసాన్ని గుర్తించి ఆయనను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేస్తారు” అని ఆయన హెచ్చరించారు.