కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రేపు హైదరాబాద్ లోని 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ – పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరులను సమాయత్తం చేసేందుకు ఈనెల 07న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రాంతాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా రేపు 244 జిల్లాలలో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా రేపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. నగరంలోని నాలుగు ప్రధాన ప్రాంతాలు అయిన సికింద్రాబాద్, గోల్కొండ, కాంచన్ బాగ్ DRDA, మౌలాలి NFC ఈ మాక్ డ్రిల్ జరుగనుందని అధికారులు ప్రకటించారు. మొత్తం మూడు కేటగిరిలలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కేటగిరి 1 కింద అణువిద్యుత్ కేంద్రాలు ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయి. కేటగిరి 2లో ప్రధాన ప్రాంతాలు 201 జిల్లాలు, అలాగే కేటగిరి 3లో 45 జిల్లాలున్నాయి.