నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ తో సమావేశమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రస్తుత పరిణామాలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ ప్రధానమంత్రికి వివరించిన కొద్ది నిమిషాల తర్వాతే ఈ బేటీ జరిగింది. ప్రధాని మోడీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలోనే సరిహద్దుల్లోని పరిస్థితులను మోడీకి గోవింద్ మోహన్ వివరించారు.
సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడంపై ఇరువురు సుదీర్ఘ చర్చ జరిపారు. మరోవైపు భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఏకపక్షంగా కాల్పులు జరుపుతోంది. ఫిరంగి దాడుల్లో కనీసం 13 మంది పౌరులు మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపింది. అయితే గాయపడిన వారిలో 44 మంది పూంచ్ సెక్టార్ నివాసితులే అని పేర్కొంది.