తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గగనతలాన్ని మండుటెండలు కబళిస్తున్నాయి. అయితే సాయంత్రం తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రెండు రాష్ట్రాలకు నాలుగు రోజుల వర్షాల హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలో ఇవాళ (శుక్రవారం) ఉత్తర తెలంగాణ మినహా మిగిలిన జిల్లాల్లో వర్షాల సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హైదరాబాద్ సహా 33 జిల్లాల్లో వర్ష సూచన ఉంది. వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే 12 నుంచి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. అల్లూరి జిల్లాలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.