ఉత్తరాది సరిహద్దు రాష్ట్రాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, తెలంగాణకు చెందిన పౌరులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలివస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు విద్యార్థులు, ఇతరులు భారీగా చేరుకుంటుండటంతో, రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సహాయ చర్యలు చేపట్టింది. వసతి, భోజనం, వైద్య సేవలు, రవాణా వంటి సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఆదివారం వరకు 86 మంది తెలంగాణవాసులు తెలంగాణ భవన్ చేరుకున్నారని అధికారులు తెలిపారు. వీరిలో 26 మందిని ఇప్పటికే స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిగిలినవారికి కూడా అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఈ సహాయక చర్యలను తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరో 100 మంది వరకు తెలంగాణ భవన్ కు వచ్చే అవకాశం ఉందని, వారికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి, తక్షణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, తెలంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు పూర్తిస్థాయి సహాయం అందించడమే దీని లక్ష్యం. ఉచిత భోజనం, వసతి, వైద్య సదుపాయాలు, తిరుగు ప్రయాణ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పంజాబ్, జమ్మూ వంటి ప్రాంతాల్లో ఉన్న అనేక మంది విద్యార్థులు ఇప్పటికే భవన్‌కు చేరుకుని సహాయాన్ని పొందుతున్నారు. అవసరమైన వారు కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించి తక్షణ సహాయం పొందవచ్చని అధికారులు తెలిపారు.