ప్రస్తుతం స్తానిక ఎన్నికల సమరం రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకుంది. అధికార వైసీపీ పరిస్తితి పక్కన పెడితే.. ప్రతిపక్షం టీడీపీకి ఈ ఎన్నికలు.. ప్రాణ సమానం. మనుటయా.. మరణించుటయా? అనేప్రశ్నలకు సమా ధానం ఈ ఎన్నికల్లోనే లభించనుంది. ఇప్పటికే అనేక మంది నాయకులు చంద్రబాబుపై నమ్మకం లేదం టూ.. పార్టీ కూడా మారిపోయారు. మరి వీటన్నింటికీ కూడా సమాధానం స్థానిక సమరమే! తాము గెలిచి.. పా ర్టీని గెలిపించేందుకు నాయకులకు ఇప్పటికీ టీడీపీలో కొదవ లేదు. పోయిన వారు పోయినను.. అన్న విధం గా ఉన్న నాయకులు అంకిత భావంతోనే ముందుకు సాగుతున్నారు.
అయితే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులకు, నేతలకు లోపించింది.. సంతృప్తి! నిజానికి వైసీపీ ఆగడాలతో తాము ఎన్నికల పోరులో పాల్గొన లేక పోతున్నామని, నాయకులు నామినేషన్లు వేయలేక పోతున్నారని చెబుతున్నా.. చాలా జిల్లాల్లో ఎలాంటి అలజడీ లేకుండానే నాయకులు నామినేషన్లు వేస్తున్నారు. అటు టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీలు పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నాయి. అయితే, టీడీపీ విషయానికి వచ్చే సరికి అధినేత చంద్రబాబు కేవలం జగన్ను టార్గెట్ చేయడం,ప్రబుత్వంపై విమర్శలు చేయడంతోనే సరిపెడుతున్నారు.
ఈ సమయంలోనే నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే నాయకులు సైకిల్ దిగిపోతున్నారు. దీంతో దిగువ శ్రేణి నాయకులకు దిశ-దశ చూపించే వారు కరువయ్యారు. దీంతో పార్టీని ఏకమొత్తంగా గెలిపించు కోవాలనే ఉత్సాహం, ఆలోచన కరువవుతోంది. దీంతో ఎవరికి వారు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. దీం తో కలివిడి తనం పోయి విడివిడిగానే ప్రచార పర్వాలు సాగిస్తున్నారు. దీంతో ప్రజలకు, పార్టీకి, నేతలకు మధ్య ఓ అగాధం వంటి పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని చోట్ల నాయకులు కలివిడిగానే ఉన్నట్టుగా కనిపిస్తు న్నా.. పదవుల విషయంలో మాత్రం అంతర్గత కుమ్ములాటలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు పార్టీ పరిస్థితి ఏంటనేది ప్రశ్నగామారింది.