ఆమరణ దీక్షకు దిగుతా అంటూ షర్మిల సంచలన ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు యాజమాన్యానిది నిరంకుశ ధోరణి. డిమాండ్ల సాధనపై రేపటి నుంచి కార్మికులు సమ్మె బాట పడుతుంటే కనీసం దిద్దుబాటు చర్యలకు దిక్కులేదని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న కనికరం కూడా లేదు. దిక్కున్న చోట చెప్పుకోండనే తీరున యాజమాన్యం వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ఇప్పటికే 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట గొట్టిన యాజమాన్యం.. మరో 3 వేల మందిని రోడ్డున పడేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం.అన్యాయాన్ని ప్రశ్నించిన కార్మికులను సైతం ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం దారుణం అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పక్షాన విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి అల్టిమేటం ఇస్తున్నాం. రేపటిలోగా తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి. రెగ్యులర్ ఉద్యోగులకు 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలి. 2021 జనవరిలో తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ ను SAIL లో విలీనం చేస్తున్నట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రేపటి నుంచి కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా ఈ నెల 21 నుంచి స్టీల్ ప్లాంట్ బయటే “ఆమరణ దీక్ష” కు దిగుతామన్నారు షర్మిల. ఆంధ్రుల హక్కు – విశాఖ ఉక్కు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, కార్మికుల ప్రయోజనాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం అన్నారు.