ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. పైగా రోజు రోజుకు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటున్నారు, వాటిలో డయాబెటిస్ కూడా ఒకటి. ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా డయాబెటిస్ తో బాధపడుతున్నారు. అటువంటి లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సరైన జీవనశైలి లేకపోవడం వలన చిన్నపిల్లలు డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
దీంతో తల్లిదండ్రులు ఎంతో భయపడుతున్నారు. చిన్న వయసులో డయాబెటిస్ ను ఎదుర్కొన్నప్పుడు లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి మరియు వాటిని గుర్తించడం ఎంతో కష్టంగా ఉంటుంది. టైప్-2 డయాబెటిస్ కు గురైనప్పుడు, లక్షణాలు ఎంతో నెమ్మదిగా బయటపడతాయి. పిల్లలు తగినంత నీరు తీసుకున్నా దాహం వేస్తుందని చెబుతూ ఉంటే, వారిని తప్పుపట్టకూడదు. ఇది టైప్-2 డయాబెటిస్‌కు చెందిన లక్షణం. ఎప్పుడైతే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయో, అవి కణజలాల నుండి ద్రవాన్ని పీల్చుకుంటాయి, దాంతో పిల్లలు డీహైడ్రేషన్‌కు గురవుతారు.
అందువల్ల వారికి తగినంత నీరు అందిస్తూ ఉండాలి. చిన్న పిల్లలు ఆహారాన్ని సరైన విధంగా తీసుకున్నప్పటికీ బరువు తగ్గుతూ ఉంటే, కచ్చితంగా జాగ్రత్త వహించాలి. వారికి సరైన ఆకలి ఉండి, మంచి ఆహారం ఇస్తున్నా బరువు తగ్గుతుంటే అది డయాబెటిస్ సమస్యకు కారణం అవ్వచ్చు. సహజంగా చిన్న వయస్సులో పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే పిల్లలు బలహీనంగా కనిపిస్తారో మరియు అలసిపోతారో, ఇవి డయాబెటిస్ లక్షణాలు అని చెప్పవచ్చు. ఇటువంటి లక్షణాలను గమనించినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే సమస్యకు సంబందించిన ఈ లక్షణాలను గుర్తించడం ద్వారా డయాబెటిస్ సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.