తెలంగాణలో ఒక మత సంబంధ కార్యక్రమం కోసం వచ్చిన ఇండోనేషియా వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణా ప్రభుత్వం గుర్తించింది. మొత్తం 12 మంది ఇండోనేసియన్ల బృందంలో 8 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వారంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు? ఎవరెవరిని కలిశారు? అనే దానిపై తెలంగాణా అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
మార్చి 13న ఢిల్లీ నుంచి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించి మార్చి 14న రామగుండంలో దిగారని, అక్కడి నుంచి వ్యాన్‌లో బయలుదేరి కరీంనగర్ చేరుకున్నారని, మార్చి 14న కలెక్టరేట్ సమీపంలోని ఓ మసీదులో ఆశ్రయం పొందారని, మదర్సాలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరి ప్రసంగాలను వినేందుకు సుమారు 150 మంది స్థానికులు వచ్చినట్లు అధికారులకు సమాచారం అందింది.
‘ఇజ్తేమా’ అనే సంస్థ తరపున వీరంతా కరీంనగర్‌కు వచ్చినట్లుగా అధికారులకు సమాచారం అందింది. మార్చి 14న కరీంనగర్ లోని స్థానిక మసీదులో వారు ఉన్నారని, నిబంధనల ప్రకారం తాము ఇండోనేసియా నుంచి వచ్చామని.. కొద్ది రోజులు ఇక్కడే ఉంటామని తెలిపారు. ఈ గ్రూప్ మార్చి 14న రామగుండం రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి, ఆటో స్టాండ్ మీదుగా నడుచుకుంటూ వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు.