కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటి వరకు కేవలం విదేశాలకు వెళ్లి వచ్చిన వారే కరోనా పాజిటివ్‌గా ఉన్నారు. మన దేశంలో ఎవరికీ కరోనా సోకలేదు. కానీ తాజా పరిణామాలను చూస్తుంటే మన దేశంలో కరోనా వైరస్ స్టేజ్ 3కి చేరుకుందా..? అనిపిస్తోంది. అందుకు తాజా సంఘటనే ఉదాహరణ అని చెప్పవచ్చు.
పూణెకు చెందిన ఓ మహిళ విదేశీ ప్రయాణం చేయకున్నా, కరోనా రోగికి దగ్గర లేకున్నా.. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే సాధారణంగా కరోనా ప్రస్తుతం విదేశాలకు వెళ్లి వచ్చిన వారిలోనే బయట పడుతుండడంతో ఇప్పటి వరకు మన దేశంలో ఆ వైరస్ స్టేజ్ 1లోనే ఉందని అనుకున్నారు. కానీ పూణె మహిళకు ఆ విధంగా కరోనా పాజిటివ్ అని వెల్లడి కావడంతో ఇప్పుడా వైరస్ మన దగ్గర స్టేజ్ 3కి చేరుకుందని భావిస్తున్నారు.
కరోనా స్టేజ్ 1లో విదేశాలకు వెళ్లి వచ్చిన వారికే పాజిటివ్ వస్తుంది. స్టేజ్ 2లో కరోనా ఉన్న వ్యక్తికి దగ్గరగా మెలిగితే ఆ వైరస్ పాజిటివ్ వస్తుంది. ఇక స్టేజ్ 3లో విదేశీ ప్రయాణం చేయకున్నా, కరోనా ఉన్న వారి దగ్గర లేకున్నా వైరస్ వ్యాపిస్తుంది. అంటే ఇది.. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అన్నమాట. కరోనా ఉన్న వారు ఒక గుంపులో ఉంటే వారి వల్ల వస్తుంది. ఇక స్టేజ్ 4లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరమవుతుంది. అది ఎవరి వల్ల, ఎలా వ్యాప్తి చెందుతుందో గుర్తించడం కష్టతరమవుతుంది. ఒకేసారి పెద్ద ఎత్తున జనాలకు వ్యాపిస్తుంది. దీంతో పరిస్థితి తీవ్రతరమవుతుంది. కాగా ప్రస్తుతం చైనా స్టేజ్ 4లో ఉండగా అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మెరుగవుతోంది.
అయితే పూణె మహిళతోపాటు ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల ఓ యువకుడికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తెలిసింది. అతను కూడా విదేశీ ప్రయాణాలు చేయలేదని, కరోనా ఉన్న వ్యక్తికి దగ్గరగా లేడని తెలుస్తోంది. దీంతో అతనికి కూడా కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ వల్ల వచ్చిందని భావిస్తున్నారు. కాగా పూణె మహిళ మార్చి 3వ తేదీన నవీ ముంబైలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో పాల్గొందని, అందుకే ఈ వైరస్ ఆమెకు వ్యాప్తి చెంది ఉంటుందని భావిస్తున్నారు.