వచ్చే ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టి కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారని పగటి కలలు కంటూ కేటీఆర్ ఏకపాత్రాభినయ చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 200 మంది చెంచాలను వెంట పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కి అధికారం దూరమై కేవలం ఏడాదిన్నరే అయిందన్నారు. రేవంత్ రెడ్డి పాలన విషయంలో ప్రజల మనస్సులో విషబీజాలు నాటేందుకు బీఆర్ఎస్ నేతలు రోజుకో నాటకానికి తెర లేపుతూ విఫలం అవుతున్నారని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి పై చేస్తున్న వ్యతిరేక ప్రచారం విఫలం అవ్వడాన్ని కేసీఆర్ కుటుంబం తట్టుకోలేక పోతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ఏమి జరగడం లేదని మేము వచ్చాక ఏదో చేస్తామని అంటున్న కేసీఆర్ ఈ పదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ చనిపోయే వరకు సీఎంగా ఉండాలని పిచ్చి భ్రమలో ఉండి.. పదవీ పోయే వరకు ఫార్మ్ హౌస్ లో పడ్డారన్నారు. 2014, 2018 బీఆర్ఎస్ మేనిఫెస్టోలు దగ్గర పెడితే 70కి పైగా హామీలు నెరవేర్చలేదన్నారు.