అందరూ అనుకున్న విధంగా ముందుగానే రాజ్యసభ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ నెల 26 న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం తాజాగా ప్రకటన విడుదల చేసింది.
రాజ్యసభ ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తామనేది మార్చి 31 తర్వాత ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తన ప్రకటనలో స్పష్టం చేసింది. జన సమూహం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న తరుణంలో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేసినట్లు వివరించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల సిబ్బంది, రాజకీయ పార్టీల నేతలు, ఏజెంట్లు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎన్నికల్లో పాల్గొనాలి.
ఎన్నికల కోసం… వారంతా గుమిగూడాల్సి వస్తుందని, వారిలో ఏ ఒక్కరికి వైరస్ ఉన్నా, అది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, అందుకే.. ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం తన ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. పలు రాష్ట్రాల్లో ఎకగ్రీవాలు కూడా అయిన సంగతి తెలిసిందే.