జుట్టు రాలడం జుట్టు పెరగకపోవడం అనేది నేటి యువత, పెద్దవాళ్లను వేధించే ప్రధాన సమస్య. ఈ సమస్యకు పరిష్కారంగా, ఇంట్లోనే ఉండి సులభంగా చేయగలిగే ఒక పురాతన పద్ధతి గురించి తరచూ వింటూ ఉంటాం. అదే గోళ్లు రుద్దడం లేదా బాలయామ (Balayam) యోగా. ఇది నిజంగా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందా? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటి? తెలుసుకుందాం.
బాలయామ అంటే ఏమిటి: బాలయామ అనేది యోగాలో భాగమైన ఒక హస్త ముద్ర లేదా ముద్ర పద్ధతి. ఈ పద్ధతిలో, రెండు చేతుల గోళ్లను (బొటన వేలు గోళ్లు మినహా) ఒకదానికొకటి తాకుతూ, సుమారు 5 నుంచి 10 నిమిషాలు పాటు వేగంగా రుద్దుతారు. ఈ పద్ధతిని రోజూ చేయడం వలన జుట్టు పెరుగుతుందని, బట్టతల సమస్య కూడా తగ్గుతుందని ఆయుర్వేదం కొన్ని సంప్రదాయ చికిత్సా పద్ధతుల్లో నమ్ముతారు.
బాలయామ పనిచేయడానికి గల కారణాన్ని రిఫ్లెక్సాలజీ అనే సిద్ధాంతంతో ముడిపెడతారు. రిఫ్లెక్సాలజీ ప్రకారం మన శరీరంలోని కొన్ని ప్రాంతాలు లేదా అవయవాలు చేతులు, కాళ్లలోని నిర్దిష్ట పాయింట్లకు అనుసంధానించబడి ఉంటాయి.

నరాల అనుసంధానం: మన చేతి వేళ్ల చివర్లలోని నరాలు స్కాల్ప్‌లోని నరాలతో అనుసంధానించబడి ఉంటాయని గోళ్లను రుద్దడం వలన ఆ నరాలు ఉత్తేజితమై ఆ ప్రభావం నేరుగా తల వైపు పయనిస్తుందని భావిస్తారు.
రక్త ప్రసరణ: గోళ్లను వేగంగా రుద్దడం వలన స్కాల్ప్‌కి రక్త ప్రసరణ పెరుగుతుందని, తద్వారా జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ మరియు పోషకాలు ఎక్కువగా అంది జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుందని నమ్ముతారు.
అయితే ఆధునిక శాస్త్రం మాత్రం ఈ వాదనను పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. గోళ్లను రుద్దడం వలన జుట్టు పెరుగుతుందనే దానికి నిర్దిష్ట శాస్త్రీయ ఆధారాలు లేవు. చాలా మంది నిపుణులు ఇది ఒత్తిడిని తగ్గించడానికి మరియు రక్త ప్రసరణ మెరుగుపరచడానికి సహాయపడుతుందే తప్ప జుట్టు పెరుగుదలకు ఇది ప్రత్యక్ష చికిత్స కాదని చెబుతారు.
గమనిక: జుట్టు రాలడం లేదా బట్టతల సమస్య తీవ్రంగా ఉంటే కేవలం బాలయామపై ఆధారపడకుండా సరైన పోషకాహారం వైద్యుల సలహా మరియు అవసరమైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.