మీరు రోజూ తీసుకునే ఆహారం మీ మనసుపై ఎంత ప్రభావం చూపుతుందో తెలుసా? వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు రావడం సర్వసాధారణం అనుకుంటాం, కానీ అది ఆహార లోపం వల్ల కూడా కావచ్చు ముఖ్యంగా ‘బి’ విటమిన్ల లోపం మీ మెదడు పనితీరును, చురుకుదనాన్ని తగ్గిస్తుందని, వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందని కొత్త పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మెదడు ఆరోగ్యానికి చురుకుదనానికి ఈ విటమిన్లు ఎందుకు అంత ముఖ్యమో తెలుసుకుందాం..
న్యూరాన్ల రక్షణ కవచం: బి విటమిన్లు,మన మెదడులోని నరాల కణాలు (న్యూరాన్స్) సరిగ్గా పనిచేయడానికి, వాటి మధ్య సమాచార మార్పిడి సజావుగా జరగడానికి బి6, బి9 (ఫోలేట్), బి12 విటమిన్లు చాలా అవసరం. ఈ విటమిన్లు హోమోసిస్టీన్ అనే అమైనో ఆమ్లం స్థాయిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో హోమోసిస్టీన్ స్థాయి పెరిగితే, అది మెదడు కణాలకు హాని కలిగించి, వాటి చుట్టూ ఉండే రక్షణ పొరను దెబ్బతీస్తుంది. ఫలితంగా, మెదడు కుంచించుకుపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం చివరకు అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మెదడు వృద్ధాప్యం: మెదడు వృద్ధాప్యం అంటే కేవలం మతిమరుపు మాత్రమే కాదు. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గడం, ఆలోచనా వేగం మందగించడం వంటివి కూడా దీని లక్షణాలే. బి విటమిన్ల లోపం ఉన్నవారిలో మెదడు వృద్ధాప్యం ఇతరుల కంటే వేగంగా జరుగుతుందని, ఇది ముఖ్యంగా మెదడులోని హిప్పోక్యాంపస్ (జ్ఞాపకశక్తికి కేంద్రం) ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తుందని పరిశోధనలు నిరూపించాయి. వయసు పెరిగే కొద్దీ, మన శరీరం బి12 విటమిన్‌ను గ్రహించుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది. కాబట్టి, ఆహారంలో వీటిని తీసుకోవడం తప్పనిసరి.
మంచి మానసిక ఆరోగ్యం, చురుకైన మెదడు కోసం బి విటమిన్లను నిర్లక్ష్యం చేయకూడదు. ఆకుకూరలు చేపలు, గుడ్లు, పాలు, తృణధాన్యాలు వంటి ఆహారాల ద్వారా ఈ విటమిన్లను పుష్కలంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారమే ఔషధం అన్న సూత్రాన్ని గుర్తుంచుకుని, మెదడుకు కావాల్సిన పోషణను అందిస్తే, మీరు వయసులో పెద్దవారైనా, మనసుతో మాత్రం యవ్వనంగా ఉండగలరు. బి12 విటమిన్ లోపం ఉన్న పెద్దవారు మరియు శాఖాహారులు వైద్యుని సలహా మేరకు సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది.
