ప్రస్తుతం ఏపీ కరోనా వ్యాప్తి నిరోధ కార్యక్రమంలో భాగంగా లాక్‌డౌన్‌లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా లాక్ డౌన్ అమలు జరుగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ప్రజలకు కొంత వెసులుబాటు కల్పిస్తూనే, మరికొంత పరిస్థితిని టైట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో పరిస్థితి ఒకింత మెరుగ్గా ఉన్నట్టుగానే భావించాల్సిన పరిస్థితి. దీనికి సంబందించి ప్రబుత్వం తీసుకున్న చర్యలను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ముందుగానే స్పందించడం, వాలంటీర్లను ప్రతి ఇంటికీ పంపి, ప్రజల ఆరోగ్యాన్ని అంచనావేసుకోవడం వంటి చర్యల కారణంగా ప్రభుత్వం ప్రజలకు కరోనా నుంచి రక్షణ కల్పించడంలో సక్సెస్ అయిందని అంటున్నారు.
ఇక, ఇప్పుడు కూడా పొరుగునే ఉన్న తెలంగాణలో వైరస్ ప్రభావిత వ్యక్తులు 70 మంది ఉండి మరణాలు ఇద్దరుగా నమోదైతే.. ఏపీలో మాత్రం బాధితుల సంఖ్య 40గానే ఉంది. దీనిని బట్టి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించలేకుండా ఎవరూ ఉండలేరు. మరి ఇలా ప్రజల నుంచి అధికారుల వరకు అందరూ కూడా ఈ విషయాన్ని చెబుతుంటే.. టీడీపీ వర్గం మాత్రం ప్రభుత్వం చేసిన చర్యలను మెచ్చుకోవడంలో పక్షపాతినికే ప్రాధాన్యం ఇస్తోంది. ఇంత కఠోర సమయంలోనూ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో టీడీపీపై విమర్శలు మరింత పెరుగుతున్నాయి.
తాజాగా వైసీపీపై విమర్శలు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాష్ట్రంలో కరోనా కేసుల కట్టడిని ప్రస్థావించారు. పొరుగు రాష్ట్రంతో పోలిస్తే..ఏపీలో తక్కువగానే ఉండడాన్ని పేర్కొంటూనే.. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిభ కాదని తేల్చేశారు. అంతా కూడా ఎన్నికల సంఘం కమిషనర్ రమేశ్‌కుమార్‌ది, సుప్రీం కోర్టుది అని పేర్కొన్నారు. అంటే.. కరోనా ఎఫెక్ట్ కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ.. రమేష్‌కుమార్ నిర్ణయించడం, దీనిని సుప్రీం కోర్టు సమర్ధించడం వల్ల ఇది సాధ్యమైందంటూ.. మరోసారి కుళ్లు రాజకీయాలకు తెరదీశారు.
సో.. ఇదే నిజమని అనుకున్నా.. వాయిదా వేయడం వల్లే కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉందా? ప్రభుత్వం క్వారంటైన్లు ఏర్పాటు చేసింది. ఇంటింటికీ వెళ్లి ప్రజారోగ్యాన్ని తెలుసుకుంది. ముందుగానే అప్రమత్తమైంది. అయినా కూడా వీటిని పట్టించుకోకుండానే టీడీపీ నాయకులు చేస్తన్న విమర్శలను ప్రజలు తిప్పికొడుతున్నారు. నిజాన్ని నిజం అని ఒప్పుకొంటే తప్పేంటి సోమిరెడ్డీ! అని ప్రశ్నిస్తున్నారు.