దేశంలో కరోనా కలకలం మున్ముందు మరింత చుక్కలు చూపించనుందా? ఇప్పటికే వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం, మరోపక్క, జనతా కర్ఫ్యూ నాటి నుంచి నేటికి 32 మంది కరోనా కారణంగా మృత్యువాత పడడం వంటివి గమనిస్తే.. ఇప్పుడు దేశంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన జోన్లో ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నిజానికి జనతా కర్ఫ్యూ మార్చి 22న జరిగింది. అప్పటికి దేశంలో ఒక్కరు కూడా కరోనా కారణంగా మృతి చెందిన వారు లేరు. కానీ, వారం గడిచేసరికి అంటే మార్చి 30 నాటికి మృతుల సంఖ్య 32కు చేరింది. అదేసమయంలో జనతా కర్ఫ్యూ విధించే నాటికి కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ఉన్న పాజిటివ్ కేసులు ఇప్పుడు 1200 పైమాటే అన్నట్టుగా ఉన్నాయి.
అంటే.. కరోనా వ్యాప్తి లేదా మృతులు కేవలం పది రోజులు కూడా గడవకముందుగానే ఈ రేంజ్‌కి చేరిపోయింది. ఇక, ఇప్పుడు తెలంగాణ, ఏపీల్లోనూ ఈ కేసులు భయపెడుతున్నాయి. మన రాష్ట్రంలో వ్యాప్తితక్కువగానే ఉందన్న సీఎం జగన్ ప్రకటన దరిమిలా మూడు గంటల్లోనే మరో మూడు కేసులు పాజిటివ్ వచ్చాయి. ఇక, ఇప్పుడు ఈ సంఖ్య మూడు పదులకు చేరిపో యింది. కరోనా అని చెప్పకపోయినా.. దీని కారణంగానే ఇప్పటికి ముగ్గురు మృతి చెందారు. వీరికి ఢిల్లీలో జరిగిన ఓ మత సంస్థ సమావేశంతో సంబంధం ఉండడంతో కరోనానే వీరికి మృతికి కారణమనేది ప్రచారంలో ఉంది.
ఇక, ఇప్పటికే ఏపీ నుంచి ఢిల్లీ సమావేశానికి వెళ్లినవారు దాదాపు వెయ్యి నుంచి 1500 మంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలోనూ రెండు నుంచి మూడు వేల వరకు ఉంటారని ప్రభుత్వం లెక్కలు తీసింది. ఈ రెండు రాష్ట్రాల నుంచే ఇంత మంది ఉంటే.. దేశంలొని మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంటి? వీరి ద్వారా ఎంతమందికి ఈ కరోనా అంటుకుందనే విషయమూ మరోపక్క కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాబోయే మరో 15 రోజుల పాటు లాక్డౌన్ సహా ప్రజల బహిరంగ పర్యటనలపై నిషేధం విధించడంతోపాటు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇలా చేయకపోతే.. ఒక్క భారత్‌లోనే మరణాల సంఖ్య వచ్చే రెండు వారాల్లో వేలు దాటినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. దీనికి అమెరికా, ఇటలీ, ఇరాన్‌లను ఉదాహరణగా చూపిస్తున్నారు. అమెరికాలో మాకేం కాదనే ధీమాతోనే ఇప్పుడు వేలల్లో మృతి చెందుతున్నారు. ఇక, ఇటలీ శ్మశానంగానే మారిపోయింది. ఇలాన్ కూడా శవాల దిబ్బగా మారింది. ఈ నేపథ్యంలో భారతీయులకు ఉన్న ఏకైక మార్గం ఇంటికే పరిమితం కావడమని అంటున్నారు ప్రముఖులు. నిపుణులు. మరి ఏం చేద్దాం!!