దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. మర్కజ్ ఘటన బయటకు వచ్చిన అనంతరం కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఘటనతో సంబంధం ఉన్నవారి కేసులే ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే కరోనా నిర్దారణ పరీక్షలకు మాత్రం చాలా ఆలస్యం అవుతుండడంతో.. ఆ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నూతన టెస్టును చేయాలని ప్రతిపాదించింది.
దేశంలో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే అవే ప్రాంతాల్లో, ఆ ప్రాంతాలకు సమీపంలో ఉంటున్న వారికి కరోనా నిర్దారణ పరీక్షలు వేగంగా చేసేందుకు గాను వారికి యాంటీ బాడీల టెస్టులను చేస్తే బాగుంటుందని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. సాధారణంగా యాంటీ బాడీ టెస్టు కూడా బ్లడ్ టెస్ట్ లాంటిదే. దాని ఫలితాలు కూడా 15 నుంచి 30 నిమిషాల్లోపే వస్తాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తిలో యాంటీ బాడీలు ఉంటే.. అతన్ని అనుమానించి కరోనా నిర్దారణ పరీక్షలకు వెళ్లవచ్చు. అదే యాంటీ బాడీలు నెగెటివ్ అయితే అలాంటి వ్యక్తులను క్వారంటైన్‌కు తరలిస్తారు. దీంతో కరోనా నిర్దారణ పరీక్షలను అవసరం ఉన్నవారికే చేయవచ్చు. అలాగే ఎంతో సమయం ఆదా అవుతుంది. కరోనా రోగులను చాలా వేగంగా కనిపెట్టవచ్చు.
ఇక ఈ యాంటీ బాడీ టెస్టులను దేశంలోని కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఉంటున్నవారికి చేయాలని ఐసీఎంఆర్ సూచించింది. ఈ క్రమంలో కరోనా పేషెంట్లను వేగంగా గుర్తించడంతోపాటు అనుమానితులను క్వారంటైన్‌కు తరలించవచ్చు. ఇక దేశంలో మొత్తం 22 కరోనా హాట్‌స్పాట్‌లను గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే తెలిపిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉండేవారికి ఇకపై యాంటీ బాడీల టెస్టును చేయనున్నారు. అయితే ఈ టెస్టులను చేయడం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చూడాలి..!