నేటి కాలంలో బరువు తగ్గడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. దీని కోసం రకరకాల డైట్లు, వ్యాయామాలు అనుసరిస్తుంటాం. అయితే ఇంటర్నెట్లో దొరికే అరకొర సమాచారం వల్ల డైట్ గురించి మనలో చాలా అపోహలు పెరిగిపోయాయి. కేవలం తక్కువ తింటేనే బరువు తగ్గుతామని లేదా కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా మానేయాలని అనుకోవడం పొరపాటు. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి క్యాలరీల లెక్క కంటే మనం తీసుకునే ఆహారం నాణ్యత ముఖ్యం. ఆ అపోహలు మరియు వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డైట్ అంటే ఆకలితో ఉండటం కాదు: చాలా మంది డైట్ అనగానే అన్నం మానేయడం లేదా కేవలం పండ్లు మాత్రమే తింటూ ఆకలితో అలమటించడం అని అనుకుంటారు. కానీ, ఇది పూర్తిగా తప్పు శరీరాన్ని పస్తులు పెట్టడం వల్ల బరువు తగ్గినట్లు అనిపించినా అది కేవలం కండరాల క్షీణత మరియు నీటి శాతం తగ్గడం మాత్రమే.
వాస్తవానికి శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే జీవక్రియ (Metabolism) మందగించి భవిష్యత్తులో బరువు పెరగడానికి కారణమవుతుంది. క్యాలరీలను లెక్కించడం కంటే, మీరు తినే ఆహారంలో ప్రోటీన్లు పీచు పదార్థాలు (Fiber) మరియు మంచి కొవ్వులు ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు దాని పరిమాణాన్ని తగ్గించి కూరగాయలను పెంచడం సరైన పద్ధతి.

క్యాలరీలు మరియు క్రవ్వుల పై అపోహలు: మరొక ప్రధాన అపోహ ఏంటంటే, అన్ని క్యాలరీలు ఒకటే అని అనుకోవడం. ఉదాహరణకు, ఒక చాక్లెట్ నుండి వచ్చే 100 క్యాలరీలు మరియు ఒక ఆపిల్ నుండి వచ్చే 100 క్యాలరీలు శరీరంలో చేసే పనులు వేర్వేరుగా ఉంటాయి. చాక్లెట్ ఇన్సులిన్ స్థాయిలను అమాంతం పెంచితే, ఆపిల్ లోని ఫైబర్ మనల్ని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది.
అలాగే కొవ్వు (Fat) తింటేనే లావు అవుతామని చాలా మంది భావిస్తారు. కానీ అవకాడో, బాదం, నెయ్యి వంటి వాటిలో ఉండే మంచి కొవ్వులు గుండెకు మేలు చేయడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా తోడ్పడతాయి. ప్రాసెస్ చేసిన షుగర్స్ మరియు బయటి జంక్ ఫుడ్ తగ్గించడమే అసలైన పరిష్కారం.
బరువు తగ్గడం అనేది ఒక రాత్రిలో జరిగే మ్యాజిక్ కాదు, ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఇంటి భోజనాన్ని మితంగా తీసుకోవడమే అత్యంత సురక్షితమైన మార్గం. మీకు సరిపడని కఠినమైన డైట్లను అనుసరించి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు.
మన పూర్వీకుల ఆహారపు అలవాట్లను పాటిస్తూ తగినంత నీరు తాగుతూ, కంటినిండా నిద్రపోతే బరువును సహజంగానే నియంత్రించుకోవచ్చు. దృఢ నిశ్చయం మరియు క్రమశిక్షణ ఉంటే ఆరోగ్యకరమైన శరీరం మీ సొంతమవుతుంది.
గమనిక: ఏదైనా కొత్త డైట్ ప్లాన్ను ప్రారంభించే ముందు మీ శరీర తత్త్వాన్ని బట్టి డైటీషియన్ లేదా డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం. ఒకరికి సరిపడిన డైట్ మరొకరికి సరిపడకపోవచ్చు.
