పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా రోగులు తాము కోరుకుంటే.. వారిని తమ తమ ఇండ్లలోనే క్వారంటైన్‌లో ఉంచుతామని ఆమె అన్నారు. ప్రభుత్వం పేదలకు, వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నవారికే సహాయం చేస్తుందన్నారు. కరోనా రోగులకు అందించే చికిత్స విషయమై దీదీ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
కాగా ప్రధాని మోడీ సోమవారం నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్‌లోనూ దీదీ పాల్గొనలేదు. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లక్షల్లో జనాలను తాము క్వారంటైన్‌లో ఉంచలేమని.. తమ వద్ద అంత సామర్థ్యం లేదని, కేవలం పేదవారికి మాత్రమే సేవ చేస్తామని దీదీ అన్నారు. ఇక లాక్‌డౌన్ ఉండాలని చెబుతున్న మోదీ మరోవైపు దశలవారీగా ఆంక్షలను సడలిస్తుండడం అందరినీ కన్‌ఫ్యూజన్‌కు గురి చేస్తుందని దీదీ అన్నారు.
కేంద్ర హోం, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఆంక్షల సడలింపు విషయంలో రోజు రోజుకీ జనాలను కన్‌ఫ్యూజ్‌కు గురి చేసే ప్రకటనలు చేస్తున్నాయని దీదీ అన్నారు. కాగా పశ్చిమబెంగాల్‌లో కరోనా కేసుల సంఖ్య 649 కి చేరుకోగా 20 మంది చనిపోయారు. ఇక అక్కడ వైద్యులకు కావల్సిన సామగ్రిని ప్రభుత్వం అందించలేకపోతుందని.. గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు..!