ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో స్టిరీన్ వాయువు లీకవడంతో.. వైజాగ్‌లో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ గ్యాస్‌ను పీల్చి తీవ్ర అస్వస్థతకు గురైన పలువురికి హాస్పిటళ్లలో చికిత్స అందిస్తుండగా.. 11 మంది ఆ గ్యాస్‌కు బలయ్యారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే సదరు పరిశ్రమలో తలెత్తిన సాంకేతిక సమస్య మూలంగానే ఆ గ్యాస్ లీకైందని జిల్లా అధికార యంత్రాంగం తెలిపింది.
స్టిరీన్ వాయువు ఆ పరిశ్రమలో లీకవ్వడానికి సాంకేతిక సమస్యనే కారణమని అధికారులు తమ ప్రాథమిక నివేదికలో తేల్చారు. ఫ్యాక్టరీలో ఉన్న 2 స్టిరీన్ ట్యాంకులకు అమర్చబడి ఉన్న రిఫ్రిజిరేషన్ యూనిట్‌లో సాంకేతిక సమస్య వచ్చిందని.. దీంతో ఆ రసాయనం వాయువు రూపంలో లీక్ అయిందని తెలిపారు. ఇక ఈ సంఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కాగా ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి సీఎం జగన్ ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై ప్రధాని మోదీ సహా పలువురు ముఖ్య నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.