చెరకు సాగులో వచ్చే లోపాలను ఈ మందుల ద్వారా భర్తీచేయొచ్చు..!

చెరుకు పంటకు జూన్ నెల నుంచి జులై నెల చివర వరకూ అనుకూలమైన కాలం..సూర్యరశ్మి, గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇది పండుతుంది. చెరుకు పంటకు అన్ని నేలల్లో ఒకటే ఎరువులు వాడటం మంచిది కాదు..నేలలు స్వభావం, నీటి లభ్యత, పంట కాలపరిమితి మీద చెరకులో వాడే ఎరువుల యాజమాన్యం అనేది ఆధారపడి ఉంటుంది. సేంద్రియ ఎరువులను వాడటం ద్వారా రసాయన ఎరువుల వాడకం కొంత వరకు తగ్గించువచ్చు. ఈరోజు చెరుకు పంటలో ఎలాంటి ఎరువులు వాడాలి..పంటలో మెళుకువలు చూద్దాం.

ఎకరానికి 5 నుండి 6 టన్నుల బాగా ఎండిన ఫిల్టరు మడ్డిని తీసుకుని..నేలలో వేసి కలియ దున్నాలి. ఇలా చేయడం వల్ల ఒక టన్ను ఫిల్దరుమడ్డి వలన 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం, 2 కిలోల పోటాష్‌ ను పంటకు అందుతాయి.

సేంద్రియ ఎరువులు లభ్యంకాని ప్రదేశాలలో 60 రోజుల వయస్సు నేలలో పచ్చిరోట్ట పైర్లు అయిన లెగ్యూం జాతికి చెందిన జనుము, పిల్లిపెసర, అలసంద, గ్లెరిసీడియా వంటి వాటిని పెంచి పుతకు రాక ముందే కలియదున్నాలి.

ఇలా కూడా కుదరదు అన్నప్పుడు.. ఒక ఎకరా చెరకు పంటకు 40 కిలోల భాస్వరం, 100 కిలోల నత్రజని మరియు 48 కిలోల పోటాష్‌ లను అందించే ఎరువులను వేసుకోవాలి.

నాటిన 45 నుండి 60 రోజులకు, 90 రోజులకు మొక్కల మొదళ్ళ మధ్య 5 సెంటిమీటర్ల లోతులో సమపాళ్ళలో నత్రజని ఎరువులను వేసి మట్టి కప్పాలి. నేలలో ఎకరాకు 12 కిలోల కన్నా తక్కువ భాస్వరం ఉన్నప్పుడు, ఆఖరి దుక్కిలో, ఎకరాకు 40 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులను వేసి కలియదున్నుకోవాలి.. 3 కిలోల ఫాస్ఫోబాక్టీరియాను ముచ్చెలు నాటిన తరువాత 6వ రోజున ఒక ఎకరాకు వేసుకుంటే భాస్వరపు ఎరువులలో సుమారు 25% వరకు ఆదా చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

ఆఖరి దుక్కిలో 48 కిలోల పోటాష్‌ నిచ్చే ఎరువులను నేలలో తక్కువగా పోటాషియం‌ ఉన్నప్పుడు వేయాలి. నత్రజనిని అందించే జీవన ఎరువులైన అజటోబాక్టర్‌ ను ఎకరాకు 2 కిలోలు లేదా అజోస్పైరిల్లంను ఎకరాకు 4కిలోలు, 500 కిలోల పశువుల ఎరువుతో కలిపి 2 దఫాలుగా నాటిన 3వ రోజున సగభాగం మిగిలిన సగభాగాన్ని 45వ రోజున వేసుకుంటే నత్రజని ఎరువులను ఆదా చేసుకోవచ్చు.

ఇనుప ధాతు లోపం ఏర్పడినప్పుడు ఆకులు పాలిపోయినట్టు అయిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగులోకి మారతాయి.. ఇనుప ధాతు లోపం కనిపించిన వెంటనే 10 గ్రాముల ఫెర్రస్‌ సల్ఫేట్, ‌ 2 గ్రాముల నిమ్మ ఉప్పును లీటరు నీటికి చొప్పున కలిపి మొక్కలపై వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేస్తే సరి.!

జింక్ ధాతు లోపం కనిపించిన మొక్కలలో ఆకుల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి, లోపం ఎక్కువైనపుడు పెరుగుదల నిలిచిపోతుంది దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యం అవుతాయి. ఈ లోపం కనిపించిన తోటకు వారం వ్యవధిలోనే లీటరు నీటికి 2 గ్రాముల జింక్‌ సల్పేట్ ను 2 సార్లు పిచికారి చేయాలి. ఒక ఎకరాకు 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ ను నేలలో వేసి కలిపి దున్నడం వల్ల ఈ లోపాల్ని తగ్గించుకోవచ్చు.