రైతుల కోసం.. యాప్ రూపొందించిన సిక్కోలు మహిళ..!

-

రైతుల కోసం..ఆలోచించే వాళ్లు చాలా తక్కువ. చదువు అవగానే.. ఉద్యోగం.. మన జీతం, జీవితం అంతే రైతుల గురించి వినూత్న ఆవిష్కరణలు చేసి వారికి సాయపడే వాళ్లు ఎక్కడో అరుదుగా ఉంటారు. అలాంటి ఆణిముత్యమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దీప్తి. రైతు కుటుంబం నుంచి వచ్చిన దీప్తి రైతుల కోసం ఏదైనా చేయాలనుకుని.. ఆ దిశగా అడుగులు వేసింది. ఈమెది ఎక్కుడో కాదు.. మన శ్రీకాకుళం జిల్లానే అండీ..!

దీప్తిది శ్రీకాకుళం జిల్లా తమ్మినాయుడు పేట. నాన్న గణపతిరావు గవర్నమెంట్ టీచర్. అమ్మ సరోజినమ్మ. ముగ్గురు అమ్మాయిల్లో తనే చిన్న. చదువంతా శ్రీకాకుళంలోనే. తన ఊరి నుంచి అక్కడికి ఒక్కటే బస్‌ ఉండేది. అదెళ్లిపోతే ఇక కాలినడకే. అలాంటి పరిస్థితుల్లో దీప్తి చదువుకుంది. డాక్టరై నలుగురికీ సేవ చేయడమామె కల. కానీ సీటు రాలేదు. వ్యవసాయాధారిత కుటుంబం. రైతులకు సాయం చేయడమూ సేవే కదా అనుకుంది. అగ్రికల్చర్‌లో పీహెచ్‌డీ చేసింది.

తాడేపల్లిగూడెంలోని ఉద్యానవర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా చేరింది. దీన్ని కేవలం ఓ ఉద్యోగంగానే చూడలనుకోలేదు. అందుకే నిరంతరం పరిశోధనలు చేసేది.. ఫలితంగా.. 37 పరిశోధన పత్రాలు, 34 ప్రత్యేక వ్యాసాలూ, 21 సాంకేతిక నివేదికలూ. వర్సిటీ కమ్యూనిటీ రేడియో, ఉద్యాన వర్సిటీ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహణ బాధ్యతా తీసుకుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే…. వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రోద్బలంతో రూపొందించిన ‘ఉద్యాన పంటల ఇ-సమాచారం’ యాప్‌ మరొకెత్తు.

యాప్ ఉద్దేశ్యం ఇదే..!

కూరగాయలు, పండ్ల రైతుల కోసం 32 రకాల పంటల వివరాలు, చీడపీడల నివారణ తదితర సమాచారాన్ని యాప్ లో పొందుపరిచింది. రైతులు తమ సందేహాలను ఎక్కడి నుంచైనా తీర్చుకునే అవకాశముండాలన్నది ఆమె ముఖ్య ఉద్దేశం. వారికోసం వర్చువల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, ఉద్యాన వర్సిటీ మ్యూజియంలో పంటలకు సంబంధించిన ‘దర్పణి’లో సమాచారాన్ని జోడించడం వంటివెన్నో చేసింది.

దీప్తి సేవల్ని గుర్తించి.. ఘజియాబాద్‌కు చెందిన సొసైటీ ఫర్‌ హార్టీకల్చర్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్ సంస్థ ‘ఔట్స్టాండింగ్‌ విమెన్‌ హార్టీకల్చర్‌ సైంటిస్ట్‌’ పురస్కారానికి ఎంపిక చేసింది. భర్త పశువైద్యుడు. వీరికో బాబు. రైతులకు ఎలాగోలా సాయం చేయాలనే తపన భార్యభర్తలు ఇద్దరీ ఉండటం వల్ల.. దీప్తి ఇలా దిగ్విజయంగా అనుకున్న రంగంలో రాణించగలుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news