పప్పుచారులో మునగకాయలు అంటే అందరికీ ఇష్టమే. మునక్కాయల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే మునగ చెట్టు ఆకుల్లో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టుకు మేలు చేసే పోషకాలు మునగ ఆకులో పుష్కలంగా ఉన్నాయి.
ప్రస్తుతం వాటి గురించి తెలుసుకొని, అవి ఏ విధంగా జుట్టుకు సహాయపడతాయో చూద్దాం.
ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవ్వటానికి.. వెంట్రుకల చివర్లు విరిగిపోకుండా పెరగడానికి, ఇంకా అనేక జుట్టు సమస్యలను తొలగించుకోవాలంటే మునగ ఆకు హెల్ప్ తీసుకోవాల్సిందే.
మునగ ఆకులో ఉండే పోషకాలు:
విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ b6 ఇంకా బయోటిన్ వంటి వెంట్రుకల మొదళ్ళకు బలాన్ని ఇచ్చే పోషకాలు ఇందులో ఉంటాయి. అంతేకాదు వీటివల్ల జుట్టు పలుచగా అవ్వకుండా ఉంటుంది.
మునగ ఆకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. జుట్టు ఊడిపోకుండా కుదుళ్ళు దృఢంగా ఉండేలా పోషకాలను అందిస్తాయి.
మునగ ఆకులో జింక్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు ఉన్నాయి. జింక్ కారణంగా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఐరన్ వల తలపై భాగానికి రక్త ప్రసరణ సరిగ్గా జరిగి జుట్టు పెరుగుతుంది.
మునగ ఆకును ఎలా వాడాలంటే..?
ఇన్ని రకాలుగా జుట్టుకు మేలు చేసే మునగ ఆకును పొడిచేసి తినవచ్చు. దీనికోసం మునగ ఆకులను ఎండబెట్టి అవి బాగా ఎండిన తర్వాత దంచి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని బ్రేక్ ఫాస్ట్ చేసే సమయంలో ఇతర ఆహారాల మీద జల్లుకుని తినవచ్చు.
ఇలా కాకుండా నీళ్లను వేడి చేసి దానిలో మునగ ఆకు పొడిని వేసుకుని బాగా కలిపి పొద్దున లేవగానే టీ తాగినట్టు తాగితే జుట్టుకి మంచి ఆరోగ్యం అందుతుంది.