చింపిరి జుట్టును సరిచేసుకోవడానికి పనికొచ్చే అవొకొడో హెయిర్ మాస్క్..

చింపిరిగా, చూడడానికి పిట్టగూడులా కనిపించే జుట్టు ఉన్నవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మీరు కూడా ఇలాంటి జుట్టుతో ఇబ్బంది పడుతున్నట్లయితే దీనికి పరిష్కారం ఉందని తెలుసుకోండి. అసలు చింపిరి జుట్టుకి కారణం వెంట్రుకల సమస్య అనుకుంటారు. కానీ, జుట్టు పొడిబారిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ పొడితనాన్ని దూరం చేసుకునేందుకు కొన్ని చిట్కాలు పనిచేస్తాయి. అవేంటో తెలుసుకోండి.

అవొకోడో హెయిర్ మాస్క్

విటమిన్లు, పోషకాలతో పుష్కలంగా నిండి ఉన్న అవొకోడో, జుట్టుపై తేమను తీసుకురావడానికి చాలా సాయపడుతుంది. దీనికోసం బాగా పండిన అవొకోడోని తీసుకుని కొబ్బరి నూనె కలుపుకుని జుట్టుకి, నెత్తిమీద మర్దన చేయాలి. వారానికి రెండుసార్లు చేస్తే బాగుంటుంది. దీనివల్ల చింపిరి జుట్టు పోయి మృదువైన కేశాలు మీ సొంతం అవుతాయి.

నిమ్మకాయ, తేనె

3:2 నిష్పత్తిలో నిమ్మకాయ, తేనె కలుపుకుని జుట్టుకి బాగా మర్దన చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేసి చూడండి. తేనె వల్ల జుట్టుకి తేమ తిరిగి వస్తుంది. నిమ్మలో విటమిన్-సి ఉంటుంది. అది జుట్టుకి మేలు చేస్తుంది.

కలబంద

అమైనో ఆమ్లాలు అధికంగా ఉండే కలబంద కారణంగా జుట్టు మెరుసేలా గుణాన్ని సంతరించుకుంటుంది. ఆయుర్వేదంలో కలబంద ప్రత్యేక స్థానం ఉంది. కలబంద రసాన్ని ఆలివ్ ఆయిల్ తో కలుపుకుని, స్నానానికి అరగంట ముందు జుట్టుకి, నెత్తికి మర్దన చేయాలి.

అరటి పండు

అరటి పండుని నుజ్జు నుజ్జు చేసి, దానికి కొంచెం తేనె, కొద్దిగా ఆయిల్ కలుపుకుని పేస్టులాగా తయారు చేయాలి. ఆ తర్వాత ఆ పేస్టుని జుట్టుకి మర్దన చేసి, 30నిమిషాలు అలాగే ఉండాలి. తర్వాత షాంపూతో స్నానం చేస్తే సరిపోతుంది.