మన శరీరంలో చాలా తక్కువ ప్రాముఖ్యం ఇచ్చే వాటిల్లో జుట్టు ఒకటి. ఎందుకో తెలియదు గానీ చాలా మంది జుట్టుని పెద్దగా పట్టించుకోరు. ఇక జుట్టు సంరక్షణ సంగతి అసలు పట్టదు. అందువల్లే చాలా తక్కువ వయస్సులోనే జుట్టు తెల్లబడడం మొదలవుతుంది. వయసుతో పాటు జుట్టు తెల్లబడడం సాధారణమే అయినప్పటికీ, యవ్వనంగా ఉన్నప్పుడే తెల్లబడుతుంటే ఆలోచించాల్సిందే. ఐతే మీరు చేసే ఏ పొరపాట్లు మీ జుట్టు తెల్లబడడానికి కారణంగా నిలుస్తున్నాయో తెలుసుకోండి.
ఒత్తిడి
ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికీ ఒత్తిడి ఉంటుంది. కానీ, దీర్ఘకాలంగా ఒత్తిడికి లోనైతే నిద్రలేమి, ఆకలి అవకపోవడం మొదలైన మార్పులు వచ్చి జుట్టు తెల్లబడడం మొదలవుతుంది. ఒత్తిడి వల్ల మీ జుట్టు తెల్లబడుతుందని మీరు భావిస్తే ధ్యానం అలవాటు చేసుకోండి. ఫలితం ఉండే అవకాశం ఉంది.
నూనెతో మర్దన చేయకపోవడం
జుట్టుకి నూనె రాయడం వల్ల నెత్తిమీద దురద కాకుండా అలాగే పొడిబారకుండా ఉంటుంది. సీబమ్ ఉత్పత్తిలో నియంత్రణ పాటించడంలో ఇది సాయపడుతుంది. నూనెతో జుట్టుకి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరిగి జుట్టు తెల్లబడడాన్ని నిరోధిస్తుంది.
ఎండలో ఎక్కువ తిరగడం
ఎండలో తిరగడం చర్మానికే కాదు జుట్టుకి కూడా మంచిది కాదు. సూర్యకిరణాల్లోని అతినీల లోహిత కిరణాలు జుట్టుని పొడిగా చేసి తొందరగా తెల్లబడేలా చేస్తాయి. అందుకని ఎండలో తిరగాల్సి వస్తే గొడుగు లేదా స్మార్ఫ్ పట్టుకెళ్ళండి.
పొగ తాగడం
పొగ తాగడం ఊపిరితిత్తులకే కాదు జుట్టుకి కూడా చేటు చేస్తుంది. అందులోని విష పదార్థాలు కేశాల కుదుళ్ళని బలహీన పర్చి తెల్లబడేలా చేస్తాయి.
రసాయనాలు
తెల్లబడ్డ జుట్టుని నల్లగా చేసుకోవడానికి రకరకాల రసాయనాలు వాడుతున్నారు. అవి జుట్టుని మరింత తెల్లగా చేస్తున్నాయి. అందుకే రసాయనాల వాడకాన్ని తగ్గిస్తే బాగుంటుంది.