శిరోజాల పెరుగుదలకు ఉపయోగపడి వాటి అందాన్ని పెంచే ఆయిల్స్..

ఆడవాళ్ళు అందానికి ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందునా పొడవాటి శిరోజాల కోసం తహతహలాడుతుంటారు. చాలా మందికి చాలా కారణాల వల్ల జుట్టు పొడవుగా పెరగదు. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్ని చేసినా జుట్టు పెరగకపోవడం వారిని ఇబ్బంది పెడుతుంటుంది. ప్రస్తుతం జుట్టు పెరుగుదలకి ఉపయోగపడే నూనెల గురించి తెలుసుకుందాం.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో యాంటీఫంగల్, యాంటీ బాక్టీరియల్ ఔషధాలు ఉంటాయి. ఇవి నెత్తి మీద ఉన్న దుమ్ముని దూరం చేస్తాయి. కొబ్బరి నూనెలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ మరియు పొటాషియం వంటి అంశాలు జుట్టు పెరుగుదలకి బాగా సహకరిస్తాయి. ఒత్తుగా పెరగడంలో సాయపడడమే కాకుండా మెరిసే గుణాన్ని అందిస్తాయి.

బాదం నూనె

జుట్టుకి మర్దన చేసుకోవడానికి బాదం నూనె చాలా మంచిది. ఇందులో విటమిన్ ఇ మరియు కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టుని తేమగా ఉంచడంతో పొడిగా అవకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

జోజోబా ఆయిల్

ఇందులో విటమిన్లతో పాటు ఖనిజాలు ఉంటాయి. ఇందులో కనిపించే అలోపేసియా మరియు టోకోట్రియానాల్స్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. మీ జుట్టు రాలిపోతున్నప్పుడు ఈ ఆయిల్ వాడితే చక్కటి ఫలితం వస్తుంది.

అముదం నూనె

ఇప్పుడంటే జుట్టుకి మర్దన చేయడానికి చాలా నూనెలు వచ్చాయి గానీ, అప్పట్లో అందరూ ఆముదం నూనెను వాడేవారు. పొలంలో ఆముదం బాగా పండించేవారు కాబట్టి అందరి ఇళ్ళలో ఉండేది. ఐతే ఇది మంచిదే అయినప్పటికీ దీనివల్ల జుట్టు బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అంతగా వాడకపోవడమే మంచిదని కొందరు చెబుతుంటారు. కొందరేమో మంచిదంటారు. మీకు నచ్చితే ఒకసారి ప్రయత్నం చేయవచ్చు.