ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం పై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం తట్టుకుని ఈ సీటుని సాధించింది టీడీపీ. అప్పటి నుంచి నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టిన వైసీపీ ముందుగా ఎమ్మెల్యేకి గాలం వేసింది. ఆ తర్వాత టీడీపీ ఇంఛార్జులుగా పనిచేసిన నేతలందరి పై దృష్టి పెట్టి వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఇప్పటికే సీనియర్ ఎమ్మెల్యే చేజారిపోయారని ఫీలవుతున్న విపక్షానికి ఇంచార్జులు సైతం పార్టీ మారడం టీడీపీలో అలజడి రేపుతుంది.
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం పొలిటికల్ గా ఎప్పుడు లైమ్ లైట్ లో ఉంటుంది. గత ఎన్నికల్లో ఓడిన ఆమంచి ఎమ్మెల్యే కరణం వర్గాల మధ్య పోరుతో ఈ నియోజకవర్గం పై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒక్కో నాయకునికి అధికారపార్టీ కండువా కప్పేస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు తాజాగా టీడీపీ ఇంఛార్జ్ యడం బాలాజీ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. చీరాల టీడీపీ ఇంఛార్జులు ఒక్కొక్కరుగా వైసీపీలో చేరడం టీడీపీని సైతం షాక్ కి గురి చేస్తుంది.
ఇప్పటికే చీరాల వైసీపీలో లీడర్లు ఫుల్‌గా ఉన్నారు. ఎవరి కుంపటి వారిదే. అలాంటి పార్టీలోకి వెళ్లేందుకు టీడీపీ ఇంఛార్జ్ యడం బాలాజీ కూడా రెడీ అయ్యారని సమాచారం. అమెరికాలో సాఫ్ట్‌వేర్ సంస్థ నడిపే యడం బాలాజీ రాజకీయాలపై ఆసక్తితో 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. 2014 వైసీపీ టిక్కెట్‌పై ఆయన పోటీచేసినా.. స్వతంత్ర అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత చీరాలలో బాలాజీయే వైసీపీకి పెద్ద దిక్కుఅయ్యారు.
2019 ఎన్నికల్లో బాలాజీ మరోసారి పోటీకి సిద్ధమైన సమయంలో వైసీపీలో చేరి టికెట్ ఎగరేసుకుపోయారు ఆమంచి. అయితే టీడీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ నేత కరణం బలరామ్ చేతిలో ఆమంచి ఓడిపోయారు. దీంతో యడం బాలాజీ వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. గత ఏడాది చీరాల టీడీపీలో ఉన్న లీడర్లు ఒక్కొక్కరుగా వైసీపీకి జైకొట్టారు. చీరాల టీడీపీ ఇంఛార్జ్‌లుగా పని చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే కరణం బలరామ్, మాజీ మంత్రి పాలేటి రామారావులు వైసీపీలో చేరిపోయారు.
ప్రస్తుతం చీరాల టీడీపీలో యడం బాలాజీ ఒక్కరే మిగిలారు. ఏడాదిగా ప్రతిపక్ష పార్టీ కార్యకలాపాలను ఆయనే నిర్వహిస్తున్నారు. చీరాలలో లీడర్లు అంతా అధికార పార్టీలో ఉంటే తానొక్కడినే టీడీపీలో ఉండటం ఎందుకు అనుకున్నారో ఏమో.. తిరిగి వైసీపీ గూటికి చేరేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనిలో భాగంగానే మున్సిపల్ ఎన్నికలకు ముందే ఆయన చేతులెత్తేసినట్టు ప్రచారం జరుగుతోంది.
గత ఏడేళ్ల కాలంలో చీరాల టీడీపీకి ఇంఛార్జులుగా పనిచేసిన వారంతా ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు.