మేకప్ తొలగించుకోవడానికి ఇంట్లో దొరికే వస్తువులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి.

-

ఇంటి నుండి బయటకు అడుగుపెడితే మేకప్ వేసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం. అలాగే కొందరు ఫంక్షన్లకో, పెళ్ళిళ్ళకో ఏదైనా పండగ సమయంలోనో మేకప్ వేసుకుంటారు. మేకప్ వేసుకునే వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం… మేకప్ తీసేసుకోవడం. అవును, మేకప్ వేసుకోవడం ఒక్కటే తెలిస్తే సరిపోదు. మేకప్ తీసేసుకోవడమూ తెలియాలి. లేదంటే చర్మం పాడవుతుంది. దీనికోసం మార్కెట్లో చాలా సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అవే కాకుండా మీ ఇంట్లోనే ఉన్న వస్తువులతో మేకప్ ని తొలగించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

పాలు

మేకప్ తొలగించడానికి పాలు బాగా పనిచేస్తాయి. పాలల్లో పత్తిని ముంచి ముఖం మీద రాయాలి. బాగా మసాజ్ చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. కావాలనుకుంటే పాలల్లో కొద్దిగా క్రీమ్ ని కలపవచ్చు.

పెరుగు

పెరుగుని మేకప్ తొలగించడానికి ఉపయోగించే ముందు దాన్ని బాగా కలపాలి. ఆ తర్వాత దాన్ని ముఖం మీద మర్దన చేసుకోవాలి. కొద్దిసేపయ్యాక నీటితో శుభ్రపర్చుకుంటే మేకప్ పూర్తిగా తొలగిపోతుంది.

ఆలివ్ ఆయిల్

మేకప్ ని తొలగించడానికి ఆలివ్ ఆయిల్ సరైన ఎంపిక. ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ లో అర టీ స్పూన్ నీటిని కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై మర్దన చేయాలి. మునివేళ్ళతో నెమ్మదిగా మసాజ్ చేసి, నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. మీ ముఖానికి పట్టి ఉన్న మేకప్ సులభంగా తొలగిపోతుంది.

తేనె, కలబంద

తేనె, కలబంద ని బాగా మిక్స్ చేసి, దానికి కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ ని కలపండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

మేకప్ వేసుకున్న తర్వాత మేకప్ తొలగించుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చర్మ సంబంధిత వ్యాధులు, మొటిమలు, చర్మం ఎర్రగా మారడం, దురద మొదలగు సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news