ఎస్ఎస్ తమన్ బర్త్ డే స్పెషల్.. జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు..!

అతిచిన్న వయసులో సంగీతంలో అరంగేట్రం చేశాడు.. 13 ఏళ్లకే తండ్రిని కోల్పోయాడు.. కుటుంబ భారం నెత్తిన వేసుకున్నాడు.. చదువుకు స్వస్తిపలికాడు.. డ్రమ్మర్‌గా కేరీర్ ఆరంభించి ఈరోజు పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు.. ఎస్ఎస్ తమన్. పుట్టినరోజు సందర్భంగా తమన్ గురించి మనకు తెలియని విషయాలను తెలుసుకుందాం.

thaman
thaman

తమన్‌ పూర్తి పేరు సాయిశ్రీనివాస్‌ తమన్‌. ప్రసిద్ధ దర్శక, నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు. నెల్లూరు స్వస్థలం. కానీ చెన్నైలో పెరిగాడు. ఆయన తండ్రి అశోక్‌ కుమార్‌ ప్రముఖ దర్శకుడు చక్రవర్తి వద్ద డ్రమ్ములు వాయించేవాడు. అమ్మ సావిత్రి గాయిని. దీంతో చిన్నతనం నుంచీ ఆయనకు సంగీతంపై మక్కువ పెరిగింది. ఆ స్ఫూర్తితో ఆరేళ్లకే డ్రమ్ములు వాయించడం మొదలుపెట్టాడు. అప్పుడు తమన్‌ వయసు 13 ఏళ్లు. మాధవపెద్ది సురేశ్‌.. తమన్‌ను పిలిచి ‘భైరవద్వీపం’ సినిమాకు డ్రమ్మర్‌గా తీసుకున్నాడు. తొలి పారితోషికంగా రూ.30 అందుకున్నాడు. మొదటి సంపాదనను అమ్మకు ఇచ్చేశారట.

తండ్రి చనిపోయినప్పుడు తమన్ ఆరో తరగతి చదువుతున్నాడు. అది కూడా సగంలో ఆగిపోయింది. తండ్రి మరణంతో ఒక్కసారిగా జీవితం తారుమారైంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట. తన జీవితం సంగీతంతో ముడిపడి ఉందని అర్థమైంది. ఎక్కడ రికార్డింగ్స్‌ ఉంటే అక్కడికి వెళ్లిపోయేవాడ్ని అని ఓసారి తమన్‌ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఏడాదికి ఆయన తండ్రి ఎల్‌ఐసీ డబ్బులొచ్చాయి. వాటితో ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ పరికరాలు కొని, వాటితో జీవితం సాగించాడు.

అతి తక్కువ కాలంలో రిథమ్‌ డ్రమ్స్‌ ప్లేయర్‌ అయిపోయాడు. రూ.30తో ప్రారంభమైన ఆయన పారితోషికం రోజుకి రూ.3 వేలకు చేరుకుంది. ‘1994 నుంచి 1997 వరకు నాకు అతి కష్టమైన రోజులు. ఆ సమయంలో రాజ్‌కోటి, మాధవపెద్ది, బాలసుబ్రమణ్యం, గంగై అమరన్‌, శివమణిగారు నన్ను ఆదుకున్నారని తమన్ తెలిపారు.

దర్శకుడు శంకర్‌ వినూత్నంగా తీసిన సినిమా ‘బాయ్స్‌’. ఈ సినిమాలో కథానాయకుడు సిద్ధార్థ్‌ స్నేహితుడిగా డ్రమ్ములు వాయించే పాత్ర చేశాడు. దీని తర్వాత కూడా తమన్‌కు నటించే అవకాశం వచ్చింది. కానీ ఆయన తిరస్కరించాడు. ‘తెరపై నటించాలంటే చాలా కష్టమండీ బాబూ.. అందుకే ‘బాయ్స్‌’ తర్వాత మళ్లీ దాని జోలికి వెళ్లలేదు.’ అని ఓ సారి తమన్‌ పేర్కొన్నాడు.

మణిశర్మ దగ్గర ‘ఒక్కడు’ కోసం పనిచేయడం తన జీవితాన్ని మార్చేసిందని తమన్‌ అంటుంటారు. ఆయన వద్ద పనిచేస్తూ ఎనిమిదేళ్లు ఉండిపోయారు. తమన్‌కు 24 ఏళ్లు వచ్చే సరికీ 64 మంది సంగీత దర్శకులతో 900 సినిమాలకు పనిచేశారు. తెలుగు, మరాఠీ, ఒరియా, మలయాళం, తమిళ్‌, కన్నడ.. ఇలా వివిధ భాషల్లో నంబరు 1 ప్రోగ్రామర్‌గా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో రోజుకు రూ.40 వేలు చార్జ్‌ చేసేవారు.

24 ఏళ్ల వయసులో తమన్‌కు సంగీత దర్శకుడిగా పనిచేశారు. అది తమిళ సినిమా. ఆ తర్వాత రవితేజ ‘కిక్‌’ సినిమాతో సిక్స్‌ కొట్టారు. తక్కువ కాలంలోనే 72 సినిమాలకు సంగీతం అందించారు. 2018లో వచ్చిన ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ లాంటి హిట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ‘క్రాక్‌’, ‘వకీల్‌ సాబ్‌’, ‘టక్‌ జగదీష్‌’ సినిమాలకు బాణీలు అందిస్తున్నారు.