అందం అమ్మాయయితే నీలా ఉందే అన్నట్టుందే అని పాడుకున్నాడు సిద్ధ్ శ్రీరామ్.అందం అనే భాషకు అర్థం తూగేలా చెప్పగలిగే ఆ పాత మధురం మధుర జ్ఞాపకం భానుప్రియ తప్ప ఇంకెవ్వరు.ఆ నడకలు ఆ వయ్యారాలు ఆ గోదావరి చెంత ఇప్పటికీ సుస్థిరాలు.ఆ గాలుల్లో స్థిరం ఆ నేలల్లో స్థిరం.అది కిన్నెర నడక అది విరుల తేనె చినుకు..రాయంచ నడక..రాగాల పరుగు.. అవును!అన్నీ కలిస్తే పాట అన్ని వివరిస్తే ప్రేమ..అన్నింటినీ కలుపుకుంటే మౌనం..అన్నింటి ఆచ్ఛాదనల్లో గడిస్తే అది రాత్రి..రాత్రిని నిషిద్ధం చేయడం సాధ్యమా? ప్రేమను నిషిద్ధం చేయడం సాధ్యమా?
కళ్లు మాట్లాడుతున్న ప్రతిసారీ మనసు స్పందిస్తుంది.మనసు స్పందించిన ప్రతిసారీ కళ్ల భాష అన్నదే మారిపోతుంది.కళ్లకూ, మనసుకూ మధ్య వారధిని నిర్మించిన వారెవ్వరో కదూ! అందాల భానుప్రియ కళ్లు మాట్లాడుతున్నాయి.ఎన్నో ఏళ్ల కిందట నుంచి ఆ చూపులు వెన్నాడుతూనే ఉన్నాయి.ఆ చూపుల భాషలో ఎన్నో రాత్రులు గడిచిపోయాయి.ఎన్నో వెన్నెల వేళలు కరిగిపోయాయి.ఆ కళ్ల లోగిళ్ల చెంతనే,ఆ చూపుల సందళ్లతోనే గోదావరి తీరాల చెంత అందమయిన రోజులు గడిచిపోయాయి కొందరికి.
గోదావరి మాట్లాడుతున్నంత హాయిగా, నది చెంత గాలుల పలకరింపు ఉంది.అవును! ఆ పలకరింపుల వేళ ఎన్నో అర్థవంతమయిన ప్రేమకథలు పుట్టుకు వచ్చాయి.చారెడు కళ్ల దగ్గర ప్రేమ ఊసులు పలికాయి.వేదనలు పలికాయి.కన్నీళ్లొచ్చేంత కథలు పుట్టాయి.కనుక ఆ కళ్లకు ఆ వాల్జడకు మరోమారు వయ్యారి గోదావరి చెంత ఆ అలల రాగం చెంత వందనాలు చెల్లించాల్సిందే!
వయ్యారి గోదావరి చెంత ఆమె పరుగులు చూశాక సితార సినిమాను మరోసారి చూడాలి. కిన్నెర సాని నడకలకు ఎన్నెల రాత్రి పలకరింపులకు మరోసారి మనసు పులకరించిపోవాలి.అన్నీ కలిసి అంతా కుదిరి కాలం వెనక్కు వెళ్తే కొంత ఉపశమనం.కొంత అర్థవంతం.కాలం చేసిన ఓ మహోపకారం ఏంటంటే జ్ఞాపకాల లోగిళ్ల చెంత మనుషులను ఒంటరి చేసి కొన్ని నియమాలు విధిస్తుంది.కొన్ని నిమిషాలు నీవి కావు అని చెబుతుంది.అప్పుడు గుర్తుకు వచ్చిన గతం ఒకవేళ అయితే చేదు లేదంటే తీపి.
ఆ విధంగా ఆ కళ్ల లోగిళ్ల చెంత పుట్టిన ప్రేమ కథ అయితే చేదు లేదా తీపి తెలియదు ముగింపు ఎలా ఉందో ఆ వేళ!
ప్రేమ ఎలా ఉంటుంది..చారెడు కళ్ల చెంత వినమ్ర పూర్వక అక్షరం అయి ఉంటుంది. పారాణి పాదాల చెంత అనుసరించిన మరో పాదం అయి ఉంటుంది.పాదాల సవ్వళ్లకు పలుకు రాగాల సవ్వళ్లకు అనునయం అయి ఉంటుంది.అటువంటి ప్రేమ చెంత ప్రకటిత కథ ఆరాధనీయం.ఆ రాధకు..ఆరాధనకు ఓ వందనం.గోదావరి చెంత పలికే రాధ పలికిన సితార ఒకనాటి భానుప్రియ.ఇప్పటి నోస్టాల్జియా!
– రత్నకిశోర్ శంభుమహంతి
చిత్ర కథంబం – మన లోకం ప్రత్యేకం