హీరోగా ప్రదీప్ మాచిరాజు… బుల్లితెరకి యాంకర్ గా గుడ్ బాయ్ చెప్పబోతున్నాడా ..?

ఆర్. జే. గా ఆ తర్వాత బుల్లితెర యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే ఉన్నట్టుండి ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే బుల్లితెర మీద పలు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంస్ తో అసాధారమైన క్రేజ్ ని సంపాదించుకున్న ప్రదీప్ నిర్మాతగాను మారి షోస్ తో సినిమా తారలతో మంచి బాండింగ్ ఏర్పరచుకున్నాడు.

 

ఇక హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ పాపులర్ యాంకర్ బుల్లితెర మీద ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. అయితే ప్రదీప్ ఈ సినిమాలో మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు. మాస్ గెటప్ లో ప్రేక్షకులను ఇప్పటికే ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకన్నా’ పాటకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ సాంగ్‌ను రిలీజ్ చేయడం కూడా ప్రదీప్ కి బాగా కలిసొచ్చింది.

అంతేకాదు టాలీవుడ్ లో ఉన్న రెండు పెద్ద నిర్మాణ సంస్థలు సపోర్ట్ చేయడం కూడా ప్రదీప్ కి బాగా ఉపయోగపడుతుంది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్, ప్రభాస్‌ .. యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాయి. మున్నా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించగా… అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ కన్నడ నిర్మాత ఎస్వీ బాబు సినిమాను నిర్మించారు. అయితే ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న ప్రదీప్ ఈ సినిమాతో హీరోగా సెటిలయితే బుల్లితెరమీద కనిపిస్తాడా అన్నది ఇప్పుడు అందరిలో మొదలైన ప్రశ్న. హీరోగా సక్సస్ అయితే మాత్రం ఇక బుల్లితెరకి గుడ్ బాయ్ చెబుతాడా అని చెప్పుకుంటున్నారు. మరి ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సూపర్ హిట్ అయితే సమయం ఉండదు కదా …!