బిగ్ బాస్: అభిజిత్ మెల్లమెల్లగా ఆడవాళ్ళకి దూరం అవుతున్నాడెందుకో..!

బిగ్ బాస్ సీజన్లో యాభై రోజుల తర్వాత గేమ్ ప్లాన్ చాలా మారిందని అర్థం అవుతుంది. దాదాపుగా సగ భాగం పూర్తయిన రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ అందరిపై ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఐతే హౌస్ లో ఇచ్చే టాస్కులు, అక్కడ ఉండే వాతావరణం వల్ల కంటెస్టెంట్స్ అందరూ మారిపోతుంటారు. ఆరియానా, సోహైల్, నోయల్ అలా మారుతూ వచ్చినవారే. ఇక ప్రస్తుతం మారుతున్నట్లు కనిపిస్తున్నది మాత్రం అభిజిత్.

అభిజిత్ మొదట్లో ఎక్కువగా ఆడవాళ్ళతోనే కనిపించేవాడు. చాలా మందిని తక్కువ చేసినట్లుగా మాట్లాడేవాడు. అఖిల్ తో ఎప్పుడూ గొడవపడుతుండేవాడు. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అఖిల్ తో దోస్తీ పెంచుకున్నాడు. మోనాల్ ని నామినేషన్స్ లోకి లాగి ఆమెతో వైరాన్ని పెంచుకున్నాడు. ఇప్పుడు హారిక వంతు వచ్చింది. హారిక, అభిజిత్ చాలా స్నేహంగా కనిపించేవారు. కానీ సడెన్ గా వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తుంది.

చిన్నపిల్లలు, కేర్ టేకర్ల టాస్కులో పిల్లల్లాగా నటించిన ఆరియానా, హారికల మధ్య పెన్సిల్ కోసం జరిగిన గొడవలో హారిక గాయపడింది. ఈ విషయంలో హారిక బాగా హర్ట్ అయినట్టుంది. ఐతే ఇక్కడ తప్పు హారికదే అని అభిజిత్ వాదిస్తున్నాడు. నువ్వు లాక్కెళ్ళావు, అందుకే ఆమె నీతో పాటు వచ్చింది అంటూ మాట్లాడడంతో హారిక హర్ట్ అయ్యింది. అదే కాదు నేనెప్పుడు మాట్లాడాలో నువ్వు నాకు చెప్పకు అనగానే అక్కడి నుండి లేచివెళ్ళిపోవడం చూస్తుంటే, వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగేలా ఉంది. ఐతే ఇదంతా గేమ్ ప్లాన్ లో భాగంగానే చేస్తున్నాడని కొందరు వాదిస్తున్నారు.