బిగ్ బాస్ పై ఈ రచ్చేంది బాస్.. కొంచెం వాడండి

తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్! ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ గేమ్.. ప్రస్తుతం సీజన్ 5 లోకి ఎంటరైంది! ఈ షోకి ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ బెల్ట్ కూడా ఉంది. ఆ సీజన్ కోసం ఆత్రుతగా ఎదురుచూసే ప్రేక్షక లోకం ఉంది. అయితే తాజాగా బిగ్ బాస్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అవును… బిగ్ బాస్ పై మొదటి నుంచి విమర్శలు వెల్లువెత్తునే ఉన్నాయి. బిగ్ బాస్‌ ను బ్యాన్ చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఒకడుగు ముందుకేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఈ షోపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. బిగ్ బాస్ గేమ్ షోను వెంటనే బ్యాన్ చేయాలనీ.. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని చెబుతున్నారు నారాయణ.

విచిత్రం ఏమిటంటే… నారాయాణ లాంటి మేధావులు.. తమ తెలివితేటలను, పోరాట పటిమను.. ప్రజాసమస్యలపై పెడితే బాగుంటుందనే కామెంట్లు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నింటిపై కంటే అధికంగా ఒక టీవీ షోపై స్పందించడం ఏమాత్రం సహేతుకం కాదనే కామెంట్లు కూడా పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా… వ్యక్తి ఇష్టాఇష్టాలను బట్టి వ్యవస్థలు నడుచుకోవనే విషయం నారాయణ గ్రహించాలనేది మరికొందరి సూచనగా ఉంది!

లెక్కప్రకారం ఏ టీవీ షోపై అయినా వ్యక్తిగత సమస్య ఉంటే… టెలివిజన్ నెట్ వర్కు (నియంత్రణ) చట్టం 1995లోని సెక్షన్ – 16 ఒకటుంది. ఆ ప్రకారం ఫిర్యాదుచేస్తే సరిపోతుంది. అప్పుడు అటోమెటిక్ గా ప్రభుత్వాలు స్పందిస్తాయి.. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుంది. అభ్యంత‌రాల‌ను ఫిర్యాదు చెయ్య‌వ‌చ్చంటూ బిగ్ బాస్ షో టెలికాస్ట్ అవుతున్న సంద‌ర్భంలో కింద స్క్రోలింగ్ కూడా వ‌స్తుంది. న‌చ్చ‌ని వారు ఫిర్యాదు చేస్తే స‌రి… ఆ మాత్రం మరిచి ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటం అవసరమా? సమాజానికి చీడ పురుగులాంటిది ఈ షో అనే స్థాయి పదప్రయోగాలు అవసరమా? ఈ విషయం నారాయణ వంటి పెద్దమనుషులకు కూడా చెప్పాలా?

నిజానికి బిగ్ బాస్ షో ప్యూర్‌గా బిజినెస్ కోసం న‌డిపిస్తున్న షో.. ఈ షో ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. 24 ఫ్రేమ్స్ వ‌ర్క్ చేస్తాయి.. వంద‌ల మందికి ఉపాధి దొర‌కుతుంది షో న‌చ్చ‌క‌పోతే చూడొద్దు, షో వ‌ల్ల న‌ష్టం జ‌రుగుతుంద‌నుకుంటే ఫిర్యాదు చేయ‌వ‌చ్చంటూ షోను స‌మ‌ర్థించే వాళ్లు చెబుతున్నారు. మ‌రో కోణంలో చూస్తే బిగ్ బాస్ షో వ‌ల్లే స‌మాజం చెడిపోతుందా..?? ఈ షో లేన‌ప్పుడు ఒక్క త‌ప్పుకూడా జ‌ర‌గ‌లేదా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. టీవీ ఆన్ చేస్తే లెక్క‌కు మిక్కిలి ఛాన‌ల్స్ వ‌స్తున్నాయి. అందులో అన్నీ చూస్తున్నారా..? అలాగే బిగ్ బాస్ చూడ‌కండంటూ స‌ల‌హా ఇస్తున్నారు.

అంత‌లా షోని తిడుతున్నారు క‌దా.. అదే స‌మ‌యంలో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు అంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న షోని ఎంత మంది చూస్తున్నారు..? నారాయ‌ణ గారు మీరు చూశారా..? బిగ్ బాస్ ను విమ‌ర్శించే వారుచూస్తున్నారా..? చూడ‌రు.. ఎందుకంటే అందులో మ‌సాలా లేదు.. అందుకే చూడ‌రు. చూస్తే మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు షో టీఆర్‌పీ అంత త‌క్కువ‌గా ఉండ‌దు..

సో.. మంచి చెడు రెండు వ‌స్తున్న టీవీలో ఎవ‌రికి న‌చ్చింది వారు చూస్తున్నారు.. నారాయ‌ణ‌తో స‌హా..

బిగ్ బాస్ గేమ్ గురించి తెలియని వాళ్ళు అనవసరంగా మాట్లాడుతున్నారనే కామెంట్ల నడుమ… బిగ్ బాస్ వల్ల సమాజంలో ఎలాంటి దుర్మార్గం జరగడం లేదు అనే విషయం సోకాల్డ్ నాయకులు ఆలోచించాలనేది నెటిజన్ల స్పందనగా ఉంది! మరి ఈ కామెంట్లపై పెద్దలు ఆలోచిస్తారా లేక ఈ రంకెలు కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి!