క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీలో సూపర్ హిట్టయిన ‘నట సామ్రాట్’ కి అఫీషియల్ రీమేక్ గా కృష్ణ వంశీ ఈ సినిమాని తీస్తున్నారు. కృష్ణ వంశీ గతంలో ఎన్నో ఆశలు అంచనాలు పెట్టుకొని తెరకెక్కించిన ‘నక్షత్రం’ భారీ డిజాస్టర్ గా మిగిలింది. వాస్తవంగా ఈ సినిమా తీయడానికి కృష్ణ వంశీ దాదాపు రెండేళ్ళు అవస్థలు పడ్డారు. ఎప్పటిలాగే తన మార్క్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, హీరోయిన్స్ గ్లామర్ చూపించినప్పటికి ‘నక్షత్రం’ ఈ క్రియోటివ్ డైరెక్టర్ కి చుక్కలు చూపించింది. ఆ దెబ్బతో చాలా రోజులు డిస్టర్బ్ అయ్యారు కృష్ణ వంశీ.
దాంతో కొంత విరామం తీసుకున్న కృష్ణ వంశీ చాలా కథలని అనుకున్నారు. అయితే అవేవి ఆయనకి తృప్తిగా అనిపించకపోవడంతో మరాఠీలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెరకెక్కించాలని డిసైడయ్యారు. ఇక చాలా సంవత్సరాల తర్వాత కృష్ణ వంశీ సతీమణి రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, బ్రంహానందం, అనసూయ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ పాటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకొని సమ్మర్ హాలిడేస్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నారు కృష్ణవంశీ.
కానీ కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా పరిస్థితి అయోమయంగా మారిందని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్స్ కంప్లీట్ చేసుకున్న అనుష్క నిశబ్ధం, నాని వి, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ .. ఇలా చాలా సినిమాలు పోటీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణవంశీకి రంగమార్తాండ సినిమాని కంప్లీట్ చేసి ప్రేక్షకులముందుకు తేవడం అంటే పెద్ద రిస్కే అని అంటున్నారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో 1998లో వచ్చిన ‘అంత:పురం’ సినిమా మ్యూజిక్ పరంగా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.