లోక్‌సభ ఎన్నికల తర్వాతే జాతీయ సినిమా అవార్డులు

-

ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా ఏప్రిల్‌లో ప్రకటించి మే 3న బహుకరించే జాతీయ చలనచిత్ర అవార్డులు ఈసారి వాయిదా పడ్డాయి. లోక్‌సభ ఎన్నికల మూలంగా అవార్డులు ప్రకటించలేకపోతున్నామని కమిటీ తెలియజేసింది.

లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున 66వ జాతీయ సినిమా అవార్డుల ప్రకటన, బహుకరణ.. రెండూ వాయిదాపడ్డాయి. ప్రసారమాధ్యమాల శక్తి ఎన్నికలను ప్రభావితం చేసేవిధంగా ఉండకూడదన్న కోడ్‌ అమల్లో ఉన్నందున 2019 అవార్డులను ఎన్నిల ప్రక్రియ ముగిసి, కోడ్‌ ఉపసంహరించిన తర్వాతే విజేతల ప్రకటన, అవార్డుల బహుకరణ చేపడతామని అవార్డుల కమిటీ నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది.

delay in National Film Awards 2019 announcement
delay in National Film Awards 2019 announcement

ప్రతి ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించి, మే 3న అవార్డులు బహుకరించడం ఆనవాయితీ. 2018వ సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు అవార్డులు ప్రకటించాల్సివుంది. అయితే ఈపాటికే విజేతలను జ్యూరీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. భారత చలనచిత్ర పరశ్రమకు ఎనలేని సేవ చేసినవారికి అందించే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు కూడా వీటితోపాటే బహుకరిస్తారు. ఈసారి మరో అవార్డు కూడా పట్టికలో చేరింది. అది ‘ మోస్ట్‌ ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌’. చిత్రనిర్మాణానికి అనువుగా ఉండి, అన్నిరకాల సౌలభ్యాలు, భద్రత ఉన్న రాష్ట్రానికి ఈ అవార్డు బహుకరించనున్నారు.

గత ఏడాది ప్రముఖ హిందీ నటుడు దివంగత వినోద్‌ ఖన్నాను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించగా, అస్సామీ సినిమా ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికయింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ రెండోభాగం ‘బాహుబలి – ది కంక్లూజన్‌’ కు ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా అవార్డు బహుకరించారు. అస్సామీ నటుడు రిద్దిసేన్‌ను ఉత్తమ నటుడిగా, గత ఏడాదే దివికేగిన సూపర్‌స్టార్‌ శ్రీదేవిని, తన అసమాన నటనతో మెప్పించిన చివరి చిత్రం ‘మామ్‌’కు గానూ ఉత్తమ నటి పురస్కారం వరించింది.

ఈసారి కూడా కొన్ని తెలుగు చిత్రాలు పోటీలో ఉండగా, రెండు మాత్రం ఆశలు రేకెత్తిస్తున్నాయి. అవి, ‘మహానటి’, ‘రంగస్థలం’. ఆనాటి మహానటి సావిత్రి జీవితగాథ ఆధారంగా అద్భుతంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. యువనటి కీర్తిసురేష్‌ సావిత్రిగా ఒదిగిపోయి ఆ పాత్రకు జీవం పోసారు. ఇక, ‘రంగంస్థలం’లో వినికిడిలోపం ఉన్న యువకుడిగా, వెనుకటి పల్లెటూర్లో జరిగిన ఒక రివేంజ్‌ కథకు మూలస్థంభంగా, చిట్టిబాబు పాత్రకు అనన్యసామాన్యంగా ప్రాణప్రతిష్ట చేసిన రామ్‌చరణ్‌ కూడా రంగంలో ఉన్నారు. చూద్దాం… ఈసారి కమలం ఎవరి కొలనులో వికసిస్తుందో..!

Read more RELATED
Recommended to you

Latest news