‘RRRకు ఆస్కార్ వచ్చినా, రాకున్నా నా స్టైల్ మారదు.. నేనింతే’

-

‘ఆస్కార్‌’ తన పనిపై ఎలాంటి ప్రభావం చూపదని అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా తెరకెక్కిన ఎపిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ ఏడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు దాదాపు రూ.1000కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

తాజాగా ఈ చిత్రాన్ని ఐఎఫ్‌సీ సెంటర్‌లో ప్రీమియర్‌ వేశారు. అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు రాజమౌళి సమాధానం ఇచ్చారు. తాను దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్‌ఆర్’కు ఆస్కార్‌ వస్తే సంతోషమేనని, కానీ, దాని వల్ల తాను తీయబోయే తర్వాతి సినిమా, దాన్ని తెరకెక్కించే విధానంలో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేశారు.

”ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆస్కార్‌ వచ్చినా, రాకున్నా నా తర్వాతి చిత్ర ప్రణాళికలో ఎలాంటి మార్పు ఉండదు. ఆస్కార్‌ అవార్డు అనేది నైతికంగా అటు సినిమాలకు, ఇటు దేశానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ, నేను పనిచేసే విధానంలో మార్పు ఉంటుందని అనుకోవడం లేదు. ఒక ఫిల్మ్‌మేకర్‌గా నన్ను నేను మరింత మెరుగు పరుచుకోవాలి. కథ చెప్పే విధానంలో నాకున్న బలాన్ని ఇంకాస్త పెంచుకోవాలి” అని జక్కన్న అన్నారు.

”సినిమా ప్రారంభంలో డిస్‌క్లైమర్‌ కార్డు వేశాం. ఇదేమీ చరిత్ర పాఠం కాదు. ఇది ఒక కల్పిత కథ. సాధారణ ప్రేక్షకుడికి సైతం అర్థమవుతుంది. ఈ సినిమాలో ఒక బ్రిటిషర్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడంటే దాని అర్థం బ్రిటిషర్లు అందరూ విలన్స్‌ కాదు. నా హీరోలు భారతీయులంతే. భారతీయులందరూ హీరోలని అర్థం చేసుకుంటే చాలు. ముఖ్యంగా ఈ సినిమాలో ఫలానా వ్యక్తి హీరో, ఫలనా వ్యక్తి విలన్‌ అని ప్రేక్షకుడికి అర్థమైతే చాలు. ప్రతిదానికి గురించి పూర్తిగా తెలియకపోయినా, భావోద్వేగాలు తారస్థాయిలో ఉంటాయి. కథ చెప్పే విషయంలో ప్రతి ఒక్కరికీ ఇది అర్థమైతే ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు” అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో ఆమిర్‌ఖాన్‌ ‘లగాన్‌’ నామినేట్‌ అయిన తర్వాత మరే చిత్రమూ ఇప్పటివరకూ ఆస్కార్‌ బరిలో నిలవలేదు. ఇన్నేళ్ల తర్వాత అ అవకాశం ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ఉందంటూ పలు మ్యాగజైన్‌ల సర్వేలు చెబుతున్నాయి. అప్పుడు ‘లగాన్‌’, ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రెండూ బ్రిటిష్‌ రాజ్‌ నేపథ్యంలో తెరకెక్కినవే కావడం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Latest news