ఆర్ఆర్ఆర్ : శివ‌గామి నుంచి సీత వ‌ర‌కు..ద‌టీజ్ రాజ‌మౌళి

-

నా మాటే శాస‌నం అని చెప్పిన శివ‌గామి
ఒక్క సినిమాతో అంద‌రినీ మ‌రోమారు
మంత్ర‌ముగ్ధుల‌ను చేసిన శివ‌గామి
అంత‌వ‌ర‌కూ ఎవ్వ‌రూ అనుకోలేదు
శ్రీ‌దేవిని మించి నటించే వారు వస్తార‌ని
కానీ ఈ పాత్ర ఈ సినిమా చూశాక
ఆమెకే అసూయ పుట్టించారు
రాజ‌మౌళి ఊహ‌ను రెట్టింపు చేసిన పాత్ర శివగామి
మళ్లీ ఇప్పుడు సీత. అలియా భ‌ట్ చేస్తున్నారీ పాత్ర
మ‌రి! రాజ‌మౌళి తాజా సినిమాలో ఆమె ఎలా ఉండనున్నారు?

శివ‌గామి పాత్ర‌కు ర‌మ్య‌కృష్ణ‌ను సిద్ధం చేశారు. ఆహార్యం (పాత్ర‌కు అనుగుణంగా వేష‌ధార‌ణ ) దిద్దారు…డైలాగ్ ఎలా ప‌ల‌కాలో చెప్పారు. నుదిటిన పెద్ద బొట్టుతో మ‌మ‌త‌ల త‌ల్లి న‌డిచి వ‌స్తోంది. ప్ర‌భాస్ చూసి పొంగిపోయారు. స‌ర్ ! నా పాత్ర‌ను దాటి ఈ పాత్ర‌కు పేరు రాబోతోంది. మీరు గుర్తు పెట్టుకోండి నా మాట నిజం అవుతుంది అని మానిట‌ర్ చెక్ చేస్తూ చెప్పారు ఈ మాట. వ్యూ ఫైండ‌ర్ లో చూస్తూ చెప్పారీ మాట‌. మాహిష్మ‌తి సామ్రాజ్య రాజ ద‌ర్బారులో ఆమె అడుగుపెట్ట‌గానే అన్యాప‌దేశంగా జ‌య‌హో రాజ‌మాత శివ‌గామీ దేవికీ  అన్న అరుపులు వినిపించాయి. రాజ‌మౌళి క‌ళ్లు చెమ‌ర్చాయి..ఆనందాలు ఇవి.. ఒకే ఒక్క యాక్ట‌ర్ ఆ పాత్ర ల‌క్ష‌ణాల‌నూ, స్వ‌భావాన్నీ అర్థం చేసుకున్నారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమెను చూశాక ప్రపంచం నివ్వెర పోయింది. జేజేలు ప‌లికింది.

షీ డిడ్ ఎ ఫ్యాబ్యుల‌స్ జాబ్

మనది హీరో సెంట్రిక్‌ ఇండస్ట్రీ. అంటే క‌థానాయ‌కుడి చుట్టూనే సినిమా అంతా..! పాత్ర ప‌రిధి..విస్తారం..పారితోషికం..ఫ్యాన్‌బేస్.. హైప్‌…ఇదంతా కాదు ఇవ‌న్నీ హీరో చుట్టూనే తిరగాలి. తిరుగుతాయి కూడా.! ఇవ‌న్నీ తెలుగు చిత్ర‌సీమ‌కు చెందిన ప్ర‌తి ప్రొడ‌క్ట్ లో ఉండాలి కూడా ! ఓ అభిమానిని అల‌రించాలంటే అవ‌న్నీ త‌ప్ప‌నిస‌రి ! ఎవరూ దీన్ని అధిగమించేందుకు వీల్లేదు. ఆ విధంగా అధిగమించేందుకు చేసిన ప్రయత్నాలలో కొన్నే కాలానికి అతీతంగా నిలిచి ఫ‌లితాలు అందుకున్నాయి. మిగిలిన‌వ‌న్నీ చేదు అనుభ‌వాలు మూట‌గట్టుకున్నాయి. రాజమౌళి సినిమాలు ఇందుకు మినహాయింపు కాదు. అక్క‌డా హీరోదే హవా.! అతడే సుప్రీం.! కెరియ‌ర్‌ మొదట్లో ఆయ‌న దర్శకత్వం వహించిన సినిమాలలో హీరోయిన్ అంటే గ్లామ‌ర్ డాల్ గానే ఉంటుంది. కానీ బాహుబ‌లి చిత్రంతో స్త్రీ పాత్ర‌ల రూప‌క‌ల్ప‌న‌లో రాజ‌మౌళి ఆలోచ‌నా విధాన‌మే మారిపోయింది. శివగామి, దేవసేన ఈ త‌ర‌హా భిన్నమైన పాత్రల రూప‌క‌ల్ప‌న అన్న‌ది ఆయ‌న‌లో వ‌చ్చిన మార్పుల‌కు సంకేతాలు. ప్రత్యేకించి శివగామి పాత్ర. ఆ పాత్రను రసవత్తరంగా పోషించిన రమ్యకృష్ణ న‌ట‌న అనిర్వ‌చ‌నీయం. అనిత‌ర సాధ్యం కూడా ! రానా, ప్రభాస్ పాత్ర‌ల‌తో సమానంగా కాదు వాటికి దీటుగా ఆ పాత్రను తీర్చిదిద్దారు. అంతే ! సమర్థవంతంగా పోషించారు రమ్యకృష్ణ. ఆమె కెరియర్లో నీలాంబరి పాత్ర కు వ‌చ్చిన కీర్తి మ‌కుటాయ‌మానం. ఏ ఫ్యాబ్యుల‌స్ జాబ్ షీ డిడ్.

అలియా పాత్ర ఎలా ఉండ‌బోతోందో ?

తాజాగా ట్రిపుల్ ఆర్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సీతపాత్ర గురించి కూడా అంతే చర్చ జరుగుతోంది.
ఈ సినిమా కూడా శివగామి, దేవసేన పాత్రలతో సమానంగా ఉండబోతోందా…అన్నది ఆస‌క్తి రేపుతున్న విష‌యం. అసలు సీత, అల్లూరికి సరిసాటి. ప్రజల కోసం ఆయన పోరాటంలోకి దూకితే అల్లూరి కోసం తన జీవితంతో పోరాటం చేసింది. ఆయన ఆలోచనలే ఊపిరిగా బతికింది. కాగా, అలియా భట్‌ మొదటిసారిగా తెలుగులో పోషిస్తున్న పాత్ర కావడం ఆ ఉత్సుకతను మరింత పెంచుతోంది. అలియా పాత్ర కూడా ఆయా పాత్రలతో సమానంగా ఉండబోతోందా? అనేది ఉత్సుకతతో ఎదురు చూస్తున్న అంశం.
అంద‌రి ఎదురు చూపులూ ఫ‌లించి ఇండియ‌న్ సొసైటీ గ‌ర్వించే స్థాయికి ట్రిపుల్ ఆర్ చిత్రంలో అలియా అభినయం అల‌రించాల‌ని
ఆశిద్దాం.

 

– స్వాతి గోపరాజు

Read more RELATED
Recommended to you

Latest news