దక్షిణాది అగ్ర కథానాయిక త్రిష పొలిటకల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్తలు సినీవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తమిళ సూపర్‌స్టార్ హీరో విజయ్ సూచన మేరకు ఆమె క్రియాశీల రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలనుకొంటున్నట్టు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అంతేకాదు.. 39 ఏళ్ల ఈ అందాల తార కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా నిర్ణయించుకున్నట్టు ఊహాగానాలు వినబడుతున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేకపోగా.. త్రిష కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఆమె రాజకీయ అరంగేట్రం నిజమైతే.. తన అందం, అభినయంతో వెండితెరపై ప్రేక్షకుల్ని మెప్పించిన త్రిష.. రాజకీయాల్లో ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేయగలుగుతారో చూడాలి.
కోలీవుడ్ ఇండస్ట్రీలో త్రిషతో దాదాపు మూడు సినిమాల్లో విజయ్ నటించారు. విజయ్‌కు ముందు నుంచి రాజకీయాల్లో ఆసక్తి ఉంది. అందుచేత త్రిషను రాజకీయాలలోకి ప్రోత్సహిస్తున్నారని సమాచారం.ఇలా విజయ్ అండతోనే ఈమె కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్రిష కూడా వారిలాగే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి జయలలిత అంతటి పేరు ప్రఖ్యాతల సంపాదించుకుంటారా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. త్రిష పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, కింగ్, బాడీగార్డ్, బంగారం, స్టాలిన్, లయన్ వంటి చిత్రాలతో తెలుగులోని స్టార్ హీరోలందరి సరసన త్రిష నటించారు. 2016లో విడుదలైన నాయకి తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె వరుస తమిళ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అందులో మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్-1 సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ధనుష్ కథానాయకుడిగా నటించిన ధర్మయోగిలో త్రిష రాజకీయ నాయకురాలి పాత్ర పోషించారు.