మీకు ”జాంబీ (Zombie)” సినిమాలు, సిరీస్ అంటే ఇష్టమా..? అయితే నెట్‌ఫ్లిక్స్ మీ కోసమే ఓ హార్రర్ జాంబీ సిరీస్‌ను త్వరలో విడుదల చేయనుంది. మే 24 నుంచి ”బేతాళ్ (Betaal)” పేరిట ఓ ఇండియన్ జాంబీ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. దీన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్‌ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించడం విశేషం.
బేతాళ్ సిరీస్‌లో వినీత్ కుమార్, అహనా కుమ్రా, సుచిత్ర పిళ్లై, జితేంద్ర జోషి, మంజిరి పుపాలా, సైనా ఆనంద్‌లు కీలకపాత్రలలో నటించగా, జతిన్ గోస్వామి, సిద్ధార్థ్ మీనన్, యశ్వంత్ వాస్నిక్, సవితా బజాజ్‌లు సపోర్టింగ్ క్యారెక్టర్లలో నటించారు. ఇక ప్యాట్రిక్ గ్రాహం, నిఖిల్ మహాజన్, సుహానీ కన్వార్లు ఈ సిరీస్‌కు రచయిత, దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. కాగా.. గెటవుట్, పారానార్మల్ యాక్టివిటీ, ది పర్జ్, ఇన్సైడియస్, హాలోవీన్, ది ఇన్విజిబుల్ మ్యాన్ తదితర ప్రముఖ హాలీవుడ్ చిత్రాలకు ప్రొడక్షన్ వర్క్ చేసిన జేసన్ బ్లమ్‌కు చెందిన బ్లమ్ హౌస్ ప్రొడక్షన్స్ బేతాళ్ సిరీస్‌కు పనిచేస్తుండడం విశేషం. మరోవైపు నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ ప్రొడక్షన్లో సహకారం అందిస్తోంది.
ఇక బేతాళ్ కథ విషయానికి వస్తే.. ”ఓ మారుమూల గ్రామంలో గ్రామస్థులను కొందరు జాంబీలు భయపెడుతుంటారు. రెండు శతాబ్దాల కిందట చనిపోయిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అధికారి జాంబీలైన తన సైనికులతో ఆ గ్రామంపై దాడి చేస్తాడు. దీంతో కౌంటర్ ఇన్సర్జెన్సీ పోలీస్ డివిజన్ (సీఐపీడీ) రంగంలోకి దిగి ఆ జాంబీలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది..” అయితే గతేడాదే ఈ సిరీస్‌ను లాంచ్ చేయాలని చూసినా.. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయింది. కానీ ఎట్టకేలకు ఈ సిరీస్ ఇక త్వరలోనే భారత ప్రేక్షకులను అలరించనుంది.