కరోనా లాక్‌డౌన్ సమయంలో చాలా మంది చాలా రకాలుగా టైం పాస్ చేశారు. కొందరు ఫోన్లలో గేమ్స్‌తో బిజీగా మారితే.. మరికొందరు ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్ ఆడారు. కొందరు వంటలు చేశారు. కొందరు ఇంటి పని, తోట పని చేశారు. ఇక వర్క్ ఫ్రం హోం వెసులుబాటు ఉన్నవారు ఇంటి నుంచే పనిచేశారు, చేస్తున్నారు. అయితే ఆ గ్రామస్థులు మాత్రం లాక్‌డౌన్ సమయాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నారు. ఈ సమయంలో తమ గ్రామానికి వారు ఏకంగా రోడ్డునే నిర్మించుకున్నారు. తమ సొంత ఖర్చులతో తామే స్వయంగా రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు.
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాకు చెందిన ఖర్కి అనే గ్రామానికి రోడ్డు లేదు. 10 ఏళ్ల కిందట ఒకటిన్నర మీటర్ల వెడల్పుతో రోడ్డు వేశారు. కానీ అదిప్పుడు రాళ్లు తేలి, అస్తవ్యస్తంగా మారింది. వాహనాలు కాదు కదా.. కనీసం కాలినడకన వెళ్లేందుకు కూడా ఆ రోడ్డు పనికిరాదు. ఇక ఆ ప్రాంతం పూర్తిగా పర్వతాల వద్ద ఉంటుంది. అయితే లాక్‌డౌన్ వల్ల ఆ గ్రామస్థులు చక్కగా ఆలోచించారు. 25 మంది కలిసి జట్టుగా ఏర్పడి రోడ్డును నిర్మించడం మొదలు పెట్టారు. ముందుగా రోడ్డుపై ఉన్న రాళ్లు రప్పలు, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఆ తరువాత నిత్యం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేశారు. వారికి గ్రామస్థులు భోజనాలను ఏర్పాటు చేశారు. ఇక నిత్యం వారు సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కులను ధరించి రోడ్డు వేశారు. ఈ క్రమంలో 40 రోజుల్లో వారు 2 మీటర్ల వెడల్పుతో.. 3 కిలోమీటర్ల పొడవున్న రోడ్డును నిర్మించుకున్నారు.
అలా ఆ గ్రామస్థులు రోడ్డును ఏర్పాటు చేసుకోవడంతో ఖర్కి నుంచి సమీపంలో ఉన్న శిలౌతి అనే గ్రామానికి మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి. అంతకు ముందు కాలినడకకు కూడా పనికిరాని రోడ్డుపై ఇప్పుడు ఏకంగా బైక్‌లు వెళ్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆ గ్రామస్థులు పడుతున్న సంతోషం అంతా ఇంతా కాదు. ఏది ఏమైనా.. తమ సొంత కష్టం, ఖర్చుతో ఆ గ్రామస్థులు అలా రోడ్డును నిర్మించుకోవడం.. నిజంగా అభినందనీయమే కదా..!