మొత్తానికి ప్ర‌భాస్ కాంప్ర‌మైజ్ అయ్యాడా?

 

`బాహుబ‌లి` త‌రువాత ప్ర‌భాస్ చిత్రాల‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఓ స‌మ‌స్య‌గా మారాడు. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `సాహో` కూడా ఇదే స‌మ‌స్య త‌లెత్తింది. ముందు ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ త్ర‌యం శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్‌ని ఫైన‌ల్‌గా అనుకున్నారు. ప్ర‌క‌టించారు కూడా. అయితే శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ కేవ‌లం ఒక పాట‌కి మాత్రమే సంగీతం అందించి ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నారు. దీంతో మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోసం మ‌ళ్లీ వేట మొద‌లుపెట్టాల్సి వ‌చ్చింది.

ఆ త‌రువాత ఒక్కో పాట‌కి ఒక్కో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని లైన్‌లోని తీసుకొచ్చారు. అలా పాట‌లకు త‌నిష్క్ బ‌గ్చి, గురు రాంధావా, బాద్ షా, శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ .. ఇలా ఆరుగురు టీమ్ సంగీతం అందించాల్సి వ‌చ్చింది. నేప‌థ్య సంగీతం కోసం గిబ్రాన్‌ని తీసుకున్నారు. దీంతో `సాహో`కు మొత్తం ఏడుగురు సంగీత ద‌ర్శ‌కులు ప‌నిచేయాల్సి వ‌చ్చింది. సుజిత్‌తో బాండింగ్ స‌మ‌స్య కార‌ణంగానే శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకోవ‌డంతో ఇలా మిగ‌తా వాళ్ల‌ని ట్రాక్‌లోకి తీసుకురావాల్సి వ‌చ్చింది.

ఇదే స‌మ‌స్య ఇప్పుడు `రాధేశ్యామ్‌` చిత్రానికి ఎదుర‌వుతోంద‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లు షికారు చేస్తున్నాయి. 60 శాతం షూటింగ్ పూర్త‌యినా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌న్న‌ది మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌లేదు. దీంతో అనుమానాలు మొద‌ల‌య్యాయి. మంగ‌ళ‌వారం చిత్ర బృందం ఈ చిత్రానికి `డియ‌ర్ కామ్రేడ్` ఫేమ్ జస్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఫైన‌ల్ చేసిన‌ట్టు ప్ర‌క‌టించింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ వెర్ష‌న్‌ల‌కు మాత్ర‌మే జస్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందిస్తాడ‌ని ప్ర‌క‌టించారు. మ‌రి హిందీ వెర్ష‌న్‌కి ఎవ‌రుంటార‌న్న‌ది వెల్ల‌డించ‌లేదు. మొత్తానికి ప్ర‌భాస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ విష‌యంలో కాంప్ర‌మైజ్ అయ్యాడు కాబ‌ట్టే జస్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ని ఫైన‌ల్ చేశార‌ని అంటున్నారు.