సినిమా పరిశ్రమలో లక్ కలిసి వస్తే ఎంత గొప్ప పేరు వస్తుందో అదే లక్ తిరగపడితే మాత్రం అదః పాతాళానికి తొక్కేస్తుంది. ఇది అక్షరాల సత్యం అయితే జీవితంలో హెచ్చు తగ్గులను సమతూకం చేసుకున్న వీరే నిలకడగా బ్రతకగలుగుతారు. డబ్బు దర్పం ఉన్నప్పుడు బాగానే ఉంటుంది అయితే అవి లేకుండా కూడా జీవితాన్ని అలవరచుకోవాలి. ఎప్పుడు లక్ మన వైపే ఉండదు కదా.
ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే పాటల రచయితగా 100 పాటలు దాకా రాసిన ఓ ప్రముఖ రచయిత చివరకు దొంగతనాలు చేస్తూ పట్టుబడటం సంచలనంగా మారింది. తేజ డైరక్షన్ లో వచ్చిన జయం, నువ్వు నేను సినిమాలకు పాటలను అందించిన కులశేఖర్ ఆ తర్వాత 100 పాటలు దాకా రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కొన్నాళ్లుగా పాటలు రాయడం మానేసిన అతను ఆర్ధిక అవసరాల కోసం దొంగగా మారాడు. ఇప్పటికే 2013లో కాకినాడ బాలాత్రిపుర సుందరి దేవి ఆలయంలో శఠగోపం కొట్టేసి ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించిన కులశేఖర్ లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఓ గుడిలో దొంగతనం చేశాడని అరెస్ట్ చేశారు.
బంజారా హిల్స్ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం కులశేఖర్ బ్రాహ్మణుల బ్యాగులు, సెల్ ఫోన్స్ దొంగతనం చేశాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా ఇంట్లో వారితో కాకుండా సెపరేట్ గా ఉంటున్న కులశేఖర్ మానసిక పరిస్థితి సరిగా లేదని అంటున్నారు. చోరీ కేసులో ఆధారాలతో పట్టుకున్న అతన్ని చంచల్ గూడ జైలులో వేశారు. ఒకప్పుడు సిని రచయితగా ఉన్న కులశేఖర్ ఇలా దొంగగా మారుతాడని మాత్రం ఎవరు ఊహించి ఉండరు.